అజార్ వెనక ఆయన హ్యాండ్ ఉందంటున్న సీనియర్లు

x
Highlights

ఎన్నికల మాటేమోగానీ కాంగ్రెస్ లో అప్పుడే సీట్ల పంచాయతీ మొదలైంది నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది....

ఎన్నికల మాటేమోగానీ కాంగ్రెస్ లో అప్పుడే సీట్ల పంచాయతీ మొదలైంది నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఆశించడంతో చర్చ కాస్తా రచ్చగా మారింది.

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత ఆల్ రౌండర్ అజారుద్దీన్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. అజారుద్దీన్ రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయాలని ఉబలాట పడుతున్నారు. అజార్ ప్రకటన కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించింది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఈ మధ్యనే నియమితులైన అంజన్ కుమార్ యాదవ్ అజారుద్దీన్ పై మండిపడుతున్నారు ఇప్పటికే ఆ సీటు నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచిన అంజన్ ముచ్చటగా మూడోసారీ బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రేటర్ హైదరాబాధ్ పరిధిలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహరచన చేసేందుకు అంజన్ నిన్న పార్టీ సీనియర్లతో సమావేశం కూడా నిర్వహించారు.

అంజన్ సమావేశానికి కొద్ది గంటల ముందే అజారుద్దీన్ ఈ ప్రకటన చేయడంతో ఆయన భగ్గుమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో అజారుద్దీన్ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న వ్యూహరచన చేసేందుకే అంజన్ ఈ సమావేశం నిర్వహించిన తరుణంలో అజారుద్దీన్ ఈ కీలక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ కు సికింద్రాబాద్ సీటు ఇస్తే అంజన్ ను ముషీరాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్ కు మార్చాల్సి ఉంటుంది. అంజన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంపీ సీటుకన్నా అసెంబ్లీ సీటుకు పోటీ చేయడమే మంచిదనే అభిప్రాయాలు కొందరు రాష్ట్ర పెద్దలు సూచిస్తున్నారు. అంజన్ యాదవ్ ను ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపితే ఆయన కుమారుడు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ యాదవ్ ను ఖైరతా బాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి మారిస్తే బెటరనే వాదనలు వినిపిస్తున్నాయి కారణం దానం నాగేందర్ టిఆరెస్ లో చేరిన తర్వాత ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు సరైన నేతలేడు. కాబట్టి అనిల్ యాదవ్ ను ఖైరతాబాద్ నుంచి బరిలోకి దింపొచ్చని సీనియర్లు కొందరు సర్దుబాటు కబుర్లు చెబుతున్నారు. ఏదేమైనా అంజన్ యాదవ్ మాత్రం అజారుద్దీన్ వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేయడానికి కూడా నేతలు భయపడుతున్న టైములో తాను పోటీ చేసి గెలిచి ఎంపీ పదవిని చేపట్టానని అంజన్ అంటున్నారు. అజారుద్దీన్ కు దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని అంజన్ యాదవ్ సవాల్ విసురుతున్నారు. ఈ వాదోప వాదాలతో నిన్నటి మీటింగ్ రచ్చగా మారడంతో విహెచ్ లాంటి నేతలు మీటింగ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అజారుద్దీన్ ఆసక్తిని కాంగ్రెస్ మన్నిస్తుందని ఆయనను పోటీకి నిలబెడతామని కాంగ్రెస్ సీనియర్లు చెబుతుంటే సీట్ల పంచాయితీ ముందు తేలాలని మరికొందరు చెబుతున్నారు. ఈమొత్తం వివాదం వెనక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉందనే ఊహాగానాలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ కు లేని ఆలోచన కల్పించింది ఉత్తమేనని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ ను తన అద్భుతమైన ప్రతిభతో కొత్తదార్లు పట్టించిన అజారుద్దీన్ 2009 ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు 2014 ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories