అలీగఢ్‌ యూనివర్సిటీకి, జిన్నాకు లికేంటి... ఆ గొడవేంటి?

అలీగఢ్‌ యూనివర్సిటీకి, జిన్నాకు లికేంటి... ఆ గొడవేంటి?
x
Highlights

దేశంలో పలు యూనివర్సిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అలీగఢ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లాంటివి వివాదాలకు కేంద్ర బిందువులుగా...

దేశంలో పలు యూనివర్సిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అలీగఢ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లాంటివి వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది ? చదువులను పక్కన బెట్టి అవి మత రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయా ? దేశ రాజకీయాలను అవి ప్రభావితం చేస్తున్నాయా ? యూనివర్సిటీలో జాతి వ్యతిరేకి ఫోటో ఉండడాన్ని సమర్థించాలా ? భారతదేశం రెండు ముక్కలయ్యేందుకు కారణమైన వ్యక్తిని మనం గౌరవించాలా ?

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రం ఉండడం వివాదానికి దారి తీసింది. గత కొన్ని రోజులుగా ఈ వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన వ్యాఖ్యలతో ఈ వివాదాన్ని మరింత వేడెక్కించారు. భారతదేశ విభజనకు కారకుడైన వ్యక్తికి భారతదేశంలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. నిజానికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఒక సెంట్రల్ యూనివర్సిటీ. చదువులకు నిలయంగా ఉండాల్సిన ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం మతపరమైన కారణాలతో ఇంతగా ఎందుకు వార్తల్లోకి ఎక్కింది.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలోని గోడకు జిన్నా ఫోటో ఉంది. ఇదే నేడు యూనివర్సిటీలో గొడవలకు మూలకారణంగా మారింది.అలీగఢ్ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ ఇటీవల అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. యూనివర్సిటీ క్యాంపస్ లో జిన్నా చిత్రాన్ని ఎందుకు ఉంచారని నిలదీశారు. దేశ విభజనకు కారణమైన వ్యక్తి ఫోటో అక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇదే విషయమై యూనివర్సిటీ విద్యార్థులకు, క్యాంపస్ లోకి ప్రవేశించిన బీజేపీ అనుకూల విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి. అసలు యూనివర్సిటీ క్యాంపస్ లో జిన్నా చిత్రం ఎందుకు ఉంది.

ఏఎంయూలో జిన్నా చిత్రం ఉండడానికి ఓ కారణం ఉంది. 1938లో ఆయనకు విద్యార్థి సంఘం జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. అలాంటి సభ్యుల ఫోటోలను కార్యాలయంలో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. దేశ విభజన ముందు వరకు .....అంటే 1947 వరకు కూడా ఈ విషయంలో వివాదం ఏదీ రాలేదు. దేశ విభజన జరిగిన తరువాత కూడా చాలా కాలం వరకు ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తదనంతర కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ముస్లిం విద్యార్థుల రాజకీయాలకు వేదికగా మారడంతో గొడవలు జరగడం మొదలైంది. ఇటీవల అక్కడి విద్యార్థులు కొందరు యూనివర్సిటీలో ఆర్ ఎస్ ఎస్ శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, అందుకు యాజమాన్యం, విద్యార్థి సంఘం అభ్యంతరం తెలియజేయడం వంటివాటితో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. హిందూ యువ వాహిని సభ్యులు యూనివర్సిటీలో జిన్నా ఫోటో ఉండడాన్ని నిరసిస్తున్నారు. దీంతో క్యాంపస్ లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి, లాఠీచార్జీ జరిగింది. టియర్ గ్యాస్ ప్రయోగించారు.

నిజానికి పాకిస్థాన్ జాతిపితగా పేరొందిన జిన్నాకు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆ యూనివర్సిటీ విద్యార్థి కాదు, అక్కడ అధ్యాపకుడిగా పని చేయలేదు. వ్యవస్థాపక సభ్యుల్లో జిన్నా కూడా ఒకరైనప్పటికీ, యూనివర్సిటీకి ఆయన చేసిందేమీ లేదు. యూనివర్సిటీతో మరే విధమైన అనుబంధం ఆయనకు లేదు. అయినా కూడా కొన్ని దశాబ్దాలుగా జిన్నా ఫోటో క్యాంపస్ లో ఉంది. అదే సమయంలో యూనివర్సిటీ ఏర్పాటులో జిన్నా కంటే ఎక్కువగాకీలకపాత్ర వహించిన మరెందరో నాయకుల ఫోటోలు అక్కడ లేవు. ఒక యూనివర్సిటీలో ఇతర దేశాల నాయకులు ఫోటోలు ఉండడంలో తప్పు లేదు. అయితే దేశ విభజనకు మూల కారకుడైన వ్యక్తి ఫోటో ఉండడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని మతపరంగా చూడాల్సిన అవసరం లేదు. జాతిపరంగా మాత్రమే చూడాలి. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతదేశ విభజనకు మూలకారకుడైన వ్యక్తి జిన్నా. అలా చూసిన నాడు భారతీయ ముస్లింలు సైతం అక్కడ జిన్నా ఫోటో ఉండడాన్ని వ్యతిరేకిస్తారనడంలో సందేహం లేదు. ఎంతో మంది ముస్లిం మేధావులు సైతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నా చిత్రం ఉండడాన్ని తప్పుబట్టారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. పాకిస్తాన్ లోని లాహోర్ లో లాలా లజపతి రాయ్ విగ్రహం ఉండేది. కరాచీలో గాంధీ విగ్రహం ఉండింది. ఆ రెండు విగ్రహాలను అక్కడ ముక్కచెక్కలు చేశారు. భారత దేశ మహానాయకులను పాకిస్తాన్ ఏమాత్రం గౌరవించడం లేదు. మరో వైపున దేశవిభజనకు కారకులైన వారి ఫోటోలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో గౌరవపురస్కారాలు అందుకుంటున్నాయి. ఇప్పుడు తలెత్తుతున్న వివాదం కేవలం ఫోటోలకు సంబంధించింది కాదు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలకు, వారు అనుసరించిన వైఖరులకు సంబంధించింది. అన్నిటికీ మించి దేశభక్తికి, జాతి ఆత్మగౌరవానికి సంబంధించింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఒక మతానికి సంబంధించిన విశ్వ విద్యాలయం కాదు...ప్రైవేటు యూనివర్సిటీ కాదు.... భారత ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న సెంట్రల్ యూనివర్సిటీ. అలాంటి చోట దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఉండడం దేశ ప్రజానీకం మనోభావాలను దెబ్బ తీయడమే కాగలదని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories