తీవ్ర విషాదం.. తల్లి అంత్యక్రియలకు వెళుతూ కొడుకు,మహిళ మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 1:37 PM IST
తీవ్ర విషాదం.. తల్లి అంత్యక్రియలకు వెళుతూ కొడుకు,మహిళ మృతి
X

మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించింది. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని పెనువిషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన ఆరిమిల్లి వెంకట సత్యనారాయణ(32) హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.అతనికి నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సత్యనారాయణ తల్లి గోవిందలక్ష్మి గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఉబికివస్తున్న దుఃఖంతో కడసారి తల్లిని చూడాలని స్వగ్రామానికి బయలుదేరారు. సత్యనారాయణ తోపాటు భార్య వెంకటసౌజన్య ఆమె సోదరి వెంకటమాధురి(21)బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున కోమరబండ వద్ద ముందు వెళ్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, మాధురి అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ కరంగోతు రాజేష్‌, సౌజన్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. కాగా తల్లి, కొడుకు మరణంతో సిద్ధాంతం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

nanireddy

nanireddy

Next Story