తెలంగాణ యంగెస్ట్ ఇంజినీర్ ఈ అమ్మాయే..

x
Highlights

వయస్సుకు మించిన ప్రతిభాపాటవాలు కనబర్చే పిల్లలు అక్కడక్కడా మనకు తారసపడుతూనే ఉంటారు. సంహిత కూడా అలాంటి అమ్మాయే ఐదేళ్ళ వయస్సులోనే సౌరశక్తి పై ఆర్టికల్...

వయస్సుకు మించిన ప్రతిభాపాటవాలు కనబర్చే పిల్లలు అక్కడక్కడా మనకు తారసపడుతూనే ఉంటారు. సంహిత కూడా అలాంటి అమ్మాయే ఐదేళ్ళ వయస్సులోనే సౌరశక్తి పై ఆర్టికల్ రాసి రాష్ట్రపతి ప్రశంసలు పొందింది. పదో ఏటనే 10వ తరగతి పరీక్షలు రాసి 90 శాతం మార్కులతో టాపర్ గా నిలిచింది. 16వ ఏడు వచ్చే సరికి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ నుండి సెక్షన్ టాపర్ గా పట్టాను పొందింది. ఇక ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే డైలమా నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రెన్యువబుల్ ఎనర్జీలో మాస్టర్ డిగ్రీ లేదా ఎంబీఏ చేయాలనుకుంటోంది. ఈ బాలమేధావి విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.


హైదరాబాద్ కు చెందిన సంహిత కాశీబట్టా తన 16వ ఏటనే నగరంలోని సిబిఐటి కాలేజీ నుండి ఇంజనీరింగ్ పట్టాను పొంది బాల మేధావిగా ఘనతను సాధించింది. తల్లిదండ్రులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగస్తులు. వారి ఏకైక కూతురు సంహిత. సంహితను మూడో ఏటనే స్కూల్ కు పంపించారు. అక్కడ ఆమె మేధస్సును గుర్తించిన ఉపాధ్యాయులు విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. మూడవ ఏటనే సుమారు 200 దేశాల రాజధానుల పేర్లను అవలీలగా చెప్పగలిగిన చిన్నారి సంహిత 4వ ఏడు వచ్చే సరికి అంగ్లం, గణితంలో నిష్ణాతురాలైంది. అప్పటికే లైబ్రరీలో పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంది సంహిత. తనకు 5వ ఏడు వచ్చే సరికి సౌరశక్తిపై ఆర్టికల్ రాసి అప్పటి రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత ఏపిజె అబ్దుల్ కలామ్ నుంచి ప్రశంసా పత్రాన్ని పొందింది.

సంహిత ఆరో తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి విద్యార్ధికి ఉండవలసిన విజ్ఞానం సంపాదించుకుంది. అది గమనించిన చిన్నారి చదువుతున్న నలంద స్కూల్ అద్యాపక బృందం చిన్నారి సంహిత 10వ ఏటనే 10వ తరగతి పరీక్షలను రాయించాలనుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా సంహిత 10వ ఏటనే పదవ తరగతి పరీక్షలు రాసి స్కూల్ లోనే టాపర్ గా నిలిచి మన్ననలు అందుకుంది. సంహితకు స్కూల్ యాజమాన్యం తమ కాలేజీ లోనే ఇంటర్మీడియట్ చదివేందుకు అనుమతించారు. 12వ ఏట ఇంటర్మీడియట్ లోను టాపర్ గా నిలిచిన సంహీతను ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష రాసేందుకు అనుమతించింది. ఎంసెట్ లోను మంచి ర్యాంకును కైవసం చేసుకున్న సంహితకు తను కోరుకున్న EEE బ్రాంచీలో సీటు ఇవ్వడానికి సిబిఐటి కాలేజీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహంతో సంహిత తన 16వ ఏటనే 89 శాతం మార్కులతో క్లాస్ లో టాపర్ గా నిలిచి ప్రశంసలు పొందింది.


ప్రభుత్వం సహకరిస్తే రెన్యువబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుందని, అది వీలు కాకుంటే MBA చేస్తానని సంహిత అంటోంది. ఈ రెండూ కుదరని పక్షంలో విదేశాలకు వెళ్ళే యోచనలో ఉంది సంహిత. మాతృభూమిపై ఉన్న అభిమానంతో 15 సంవత్సరాల క్రితం US లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్ కు వచ్చిన సంహిత తల్లిదండ్రులు కాసి బట్టు, సంధ్యాశ్రీ లు తమ కూతురికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. సంహిత తన 12 ఏళ్ల విద్యాబ్యాసంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. నాటి ప్రముఖులు ప్రతిబా పాటిల్, మన్మోహన్ సింగ్ లతో పాటు గవర్నర్ నరసింహన్, నారా చంద్రబాబు నాయుడు, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కె. చంద్రశేఖర రావుల నుంచి ప్రశంసా పత్రాలను పొంది తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుముడింప జేసింది. సంహిత మేధా శక్తిని గుర్తించిన పలు విదేశీ ఇంజనీరింగ్ కాలేజీల తోపాటు దేశంలోని బెంగుళూర్, పూణె, డెహరాడూన్ లలో ఉన్న IIT విద్యాసంస్థలు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చాయి. కానీ స్వరాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం అలాంటి అవకాశం ఇస్తే బాగుంటుందని సంహిత తోపాటు ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories