గమనిక: డిసెంబర్ నుంచి మారుతున్నకొత్త నిబంధనలివే!
కొన్ని విధాన మార్పులు లేదా నిబంధనల్లో మార్పులు మన ఆర్ధిక పరిస్థితుల పై ప్రభావం చూపుతాయి. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొన్ని నిబంధనలు..
ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలలో కొత్త పాలసీలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ సంవత్సరానికి చివరి నెలలో కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు అమలు జరగనున్నాయి. వీటి ప్రభావం అందరి మీదా పడనుంది. కొన్ని నిర్ణయాల ప్రభావంతో నేరుగా వినియోగదారులకు షాక్ తగలనుంది.
మొబైల్ బాదుడు!
వాటిలో ముఖ్యమైనది మొబైల్ బిల్లు. జియో ప్రభావంతో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన మొబైల్ సేవల ధరలు ఈ ఒకటో తారీఖు నుంచి అందరికీ షాక్ ఇవ్వనున్నాయి. ట్రాయ్ నిబంధనలు అనుసరించి ఇప్పటికే జియో తన టారిఫ్ లను సవరించింది. ఉచితాలకు సెలవిచ్చి బాదుడు మొదలెట్టింది. ఇప్పుడు అదే బాటలో మిగిలిన మొబైల్ ఆపరేటర్లూ డిసెంబర్ 1 నుంచి చార్జీల బాదుడు ప్రారంభిస్తున్నారు. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి ఆపరేటర్లు అందరూ ఈ ఒకటో తేదీ నుంచి టారిఫ్ లు పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన టారిఫ్ లు పెంచనుందనే వార్తలు వస్తున్నాయి.
ఎల్ఐసీ పాలసీలు..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీ ఏఐ) నిబంధనలు సవరించింది. దీని ప్రకారం ఇన్సూరెన్స్ పాలసీల లో మార్పులు రానున్నాయి. ఎల్ఐసీ తన పాలసీల్లో డిసెంబర్ 1 నుంచి పలు మార్పులు తీసుకువస్తోంది.
నాలుగు సెక్షన్లుగా కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను విభజిస్తున్నారు. దీనిప్రకారం సెక్షన్ 1లో ప్రపోజర్ వివరాలు, సెక్షన్ 2లో ప్రపోజ్డ్ ప్లాన్ , సెక్షన్ 3లో ప్రపోజల్ డీలైల్స్, ఫ్యామిలీ హెల్త్, అలవాట్లు వంటివి, సెక్షన్ 4లో ప్రపోజర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది.
ఇక డిక్లరేషన్ పార్ట్ లో ఇప్పుడు 3 సంతకాలు కాకుండా ఇప్పుడు ప్రపోజర్ 7 చోట్ల సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఎల్‌ఐసీ ఏజెంట్లు విడిగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌ను కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 1 నుంచి కంపెనీ రీలాంచ్ చేసిన ప్లాన్లకు కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను స్వీకరిస్తుంది.
ఫాస్టాగ్..
వాహనాలకు టోల్ గేట్ రుసుము కోసం ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈ ఒకటో తేదీ నుంచే ఇది అమలు లోకి రావాల్సి ఉంది కానీ, దానిని 15 వ తేదీ వరకూ పెంచారు.
24 గంటలూ నెఫ్ట్..
ఆర్బీఐ ఆధీనంలో ఉన్న నగదు బదిలీ విధానం నెఫ్ట్ ఇక 24 గంటలూ పనిచేస్తుంది. ఇంతకు ముందు ఈ విధానంలో నగదు బదిలీకి ప్రభుత్వ పనిదినాల్లో రాత్రి 7:45 గంటల వరకూ మాత్రమే అవకాశం ఉండేది. అంటే కాకుండా రెండు నాలుగు శనివారాల్లో సెలవు ఉండేది. ఈ డిసెంబర్ ఒకటి నుంచి దీనిని సవరించనున్నారు. దీంతో నెఫ్ట్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ నగదు బదిలీ చేయవచ్చు.


