Gold rate: వారమంతా అటూ ఇటూ..స్వల్ప పెరుగుదలతో బంగారం ధరలు.. కొద్దిగా పైకెగసిన వెండి ధరలు!

Gold rate: వారమంతా అటూ ఇటూ..స్వల్ప పెరుగుదలతో బంగారం ధరలు.. కొద్దిగా పైకెగసిన వెండి ధరలు!
x

Gold and Silver rate in India weekly analysis

Highlights

Gold Rate: వారాంతానికి బంగారం ధరలు స్వల్ప పెరుగుదలతో ఉండగా, వెండి ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. గత వారంలో బంగారం, వెండి ధరల కదలికలు ఇలా ఉన్నాయి

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(సెప్టెంబర్ 07) నుంచి శనివారం(సెప్టెంబర్ 12) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

పడుతూ..లేస్తూ..చివరికి స్థిరంగా పసిడి!

గత వారంలో (సెప్టెంబర్ 07 నుంచి సెప్టెంబర్ 12 వరకు) బంగారం ధరలు రెండు రోజులు పైకెగసి..రెండు రోజులు కిందికి.. రెండు రోజులు స్థిరంగా నిలిచి మొత్తమ్మీద స్వల్ప పెరుగుదల తో ముగిశాయి. వారం అంతా అటూ ఇటూ అయిన పసిడి ధరలు వారాంతానికి పాటి పెరుగుదల తో నిలిచాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారంకంటె ఈ వారాంతానికి పెరుగుదల బాటలోనే నడిచాయి.

అయితే, గత వారంతంలో ప్రారంభమైన పసిడి ధరల కింది చూపులు ఈ వారం కొనసాగాయి. సెప్టెంబర్ 07 వతేదీ సోమవారం పది గ్రాములకు 40 రూపాయలు తగ్గిన బంగారం ధరలు తరువాతి రోజూ అంటే మంగళవారం (సెప్టెంబర్ 08) మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. బుధవారం (సెప్టెంబర్ 09) తరువాతి రోజు (సెప్టెంబర్ 10) రెండురోజులూ కలిపి 430 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. ఇక అటు తరువాత రెండురోజులూ వరుసగా స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. చివరకు శనివారం సెప్టెంబర్ 12న 80 రూపాయల స్వల్ప తగ్గుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(సెప్టెంబర్ 07) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 48,890 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 12) సాయంత్రం 48,900 రూపాయల వద్ద ముగిశాయి. అంటే కేవలం 10 రూపాయల స్వల్ప పెరుగుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(సెప్టెంబర్ 07)న పది గ్రాములకు 53,320 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 12) సాయంత్రం 53,350 రూపాయల వద్ద ముగిశాయి. అంటే వారం మొత్తం చూసుకుంటే బంగారం దాదాపు 50 రూపాయల స్వల్పపెరుగుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు దిగొచ్చాయి..!

ఇక దేశీయంగా వెండి ధరలు కూడా కిందికీ మీదికి కదులుతూ వచ్చాయి. స్థిరం లేకుండా పెరిగినపుడు అమాంతం పెరగడం తగ్గినపుడూ అదే మాదిరిగా కిందికి పడిపోవడం జరుగుతూ వచ్చింది. వారం పొడవునా వెండి ధరలు అటూ ఇటూ కదిలాయి. వారం ప్రారంభంలో సోమవారం(సెప్టెంబర్ 07) కేజీ వెండి 67,210 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు కేజే వెండి ధర 890 రూపాయలు పెరిగింది... అటు తరువాతి రోజు అంటే మంగళవారం(సెప్టెంబర్ 08) 100 రూపాయల తగ్గుదల చూపించింది. మర్నాడు (సెప్టెంబర్ 09) కూడా అదే స్థాయిలో 100 రూపాయలు దిగివచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ 10 వతేదీ శుక్రవారం ఒక్కసారిగా 600 రూపాయలు పైకెగసింది. మర్నాడు సెప్టెంబర్ 11 న ఒక్కసారిగా 580 రూపాయలు తగ్గింది. ఇలా వారం అంతా నిలకడ లేకుండా వెండి ధరలు మార్పులకు గురవుతూ వచ్చాయి. మొత్తమ్మీద వారాంతానికి 690 రూపాయలు పెరిగి 67,900 రూపాయల వద్ద నిలిచింది.

ఇక శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడంతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

Show Full Article
Print Article
Next Story
More Stories