ఈయన కర్నూలు జిల్లా శ్రీమంతుడు !

ఈయన కర్నూలు జిల్లా శ్రీమంతుడు !
x
Highlights

పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న కోరిక కొందరికి బలంగా వున్నా ఆర్థిక పరిస్థితి బాగాలేకనో, పరిస్థితులు అనుకూలించకనో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక...

పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న కోరిక కొందరికి బలంగా వున్నా ఆర్థిక పరిస్థితి బాగాలేకనో, పరిస్థితులు అనుకూలించకనో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక చేతులెత్తెస్తూ ఉంటారు. కలలను నెరవేర్చుకునే అవకాశం భగవంతుడు కొందరికి మాత్రమే ఇస్తాడు. అటువంటి అవకాశం ఓవ్యక్తికి రావటంతో, లక్షల పెట్టుబడితో శాశ్వత నిర్మాణాలను పూర్తి చేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే ప్రయత్నంలో బిజీగా వున్నాడు. ఇంతకు అతనెవరో..? అతను చేస్తున్న పనులేమిటో మనం కూడా చూద్దాం.

మీ అందరికి మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో పుట్టిన గడ్డ కోసం శ్రమిస్తాడు. ఆ సినిమాను తలపించేలా కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ వ్యక్తి సొంత ఊరు కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. తన ఊరివారి కోసం లక్షలు వెచ్చించి సమస్యలు తీరుస్తున్నాడు. వైయస్సార్సీ పార్టీకి చెందిన పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి పత్తికొండలో పుట్టి పెరగడం వల్ల అక్కడి సమస్యలన్నీ అతనికి తెలుసు. కాలం కలిసి వచ్చి ఓ హోదాకు చేరుకున్న తర్వాత తన సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని నడుం బిగించాడు. కష్టాలతో తన ఇంటి గడప తొక్కిన వారి సమస్యలు పరిష్కరిస్తున్నాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా, పత్తికొండలో వైస్సార్సీపీ ముఖ్యకార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ రెడ్డి అభివృద్ధి కార్యాక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

పత్తికొండ ప్రాంతం అంటేనే కరువుకు కేరాఫ్ అడ్రాస్. మంచి నీటి కోసం ఇక్కడి ప్రజలు పడుతున్న బాధను చూసి కలత చెందిన మురళిధర్రెడ్డి మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసాడు. ప్రతిరోజు ఇంటికి రెండు బిందెల చొప్పున నీటిని పంపిణీ చేస్తున్నారు. అలాగే 250 కుటుంబాలున్న కొండగిరి ప్రాంతంలో కేవలం రెండు నీటి కొలాయిలతో కాలనీవాసులు ఇబ్బంది పడుతుండేవారు. వారి సమస్య తీర్చేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ఓ కొలాయిని వేయించాడు.

గతంలో పాలకుల ముందుచూపు లేక పత్తికొండ చెరువు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. చెరువుకు సమీపంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నా అవి చెరువులోకి చేరే మార్గాలన్ని మూసుకుపోవడంతో నీరంతా వృధాగా పోయేవి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించిన మురళీధర్ రెడ్డి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాజాగా కురిసిన వర్షాలతో పత్తికొండ చెరువుకు జలకళ తెప్పించారు. చెరువు సమీపంలోని నల్లగుట్టవాగు పొంగి రెండు వందల ఎకరాల పొలాలు నీట మునిగేవి. స్థానికులతో కలిసి ఆలోచన చేసిన మురళీధర్ రెడ్డి రెండు కిలో మీటర్ల మేర వాగు వెడల్పు పెంచి కాల్వను నేరుగా పత్తికొండ చేరువులోకి మళ్లించారు. దీంతో ఇప్పుడు చెరువు పూర్తిగా నీరుతో నిండుకుని రైతులకు ఆనందాన్ని మిగిల్చింది.

పత్తికొండ నియోజకవర్గం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా పంటలపైన ఆధారపడి జీవిస్తారు. వీరిని దృష్టిలో పెట్టుకొని మూడు ఎకరాల లోపు ఉండే చిన్నకారు రైతులకు ఎకరాకు ఒకబస్తా చొప్పున మూడు ఎరువుల బస్తాలను సబ్సిడీతో అందిస్తున్నారు. దీని కోసం ప్రతీ రైతుకు ప్రత్యేక సభ్యత్వం కల్పించారు. కార్డు తీసుకున్న ప్రతి రైతుకు వారి పంటపొలాల్లో ఉచితంగా ట్రాక్టర్లతో సేద్యం చేయించనున్నారు. తన తృప్తి కోసమే సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్న మురళీధర్ రెడ్డి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని హెచ్ఎంటీవీ మనస్పూర్తిగా ఆకాంక్షిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories