YSR 71st Birth Anniversary : వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి

YSR 71st Birth Anniversary : సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి..

Arun Chilukuri
Updated on: 8 July 2020 9:51 AM IST
YSR 71st Birth Anniversary : వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి
X

YSR 71st Birth Anniversary : సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం.. డాక్టర్‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను స్మ‌రించుకుంటూ బుధవారం నివాళులర్పించారు. "నాన్న‌గారి 71వ జ‌యంతి నేడు. ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది" అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక వైఎస్సార్‌ జయంతి సందర్భంగా "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైఎస్సార్‌". వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. పుస్తకావిష్కరణ అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే..

ఇడుపులపాయలో నిర్వహిస్తున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడ పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తోంది. ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్‌ చేసిన తర్వాత జయంతి కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ పరీక్షలు చేయించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story