Top
logo

Villagers Fear From Rain: వర్షం వస్తే చాలు ఆ గ్రామస్థులకు వణుకే!

Villagers Fear From Rain: వర్షం వస్తే చాలు ఆ గ్రామస్థులకు వణుకే!
X
Highlights

Villagers Fear From Rain: : వర్షాలు రావాలని యజ్ఞయాగాలను చేసే గ్రామాలను చూసాం. వర్షం వస్తే ఊరు సస్యశామలంగా...

Villagers Fear From Rain: : వర్షాలు రావాలని యజ్ఞయాగాలను చేసే గ్రామాలను చూసాం. వర్షం వస్తే ఊరు సస్యశామలంగా మారుతుందనే గ్రామస్థులను చూశాం. కాని వర్షం మాట వింటేనే ఆ గ్రామంలో వణుకు పుడుతుంది. వర్షం తగ్గేవరకు ముక్కులు బిగపట్టుకొని బతకాల్సి వస్తుందనే భయం వారిని వెంటాడుతుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది వర్షానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది.

అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఆధునిక జీవన విధానాలకు నెలవైన తిరుపతికి సమీపంలోని ఉంది చిత్తూరు జిల్లాలోని గాజుల మండ్యం పారిశ్రామికవాడ. పారిశ్రామికవాడకు ఆనుకొని మూడు మండలాలకు చెందిన గ్రామాలు గత రెండు దశాబ్దాలుగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మెట్టప్రాంతమైన చిత్తూరు జిల్లాలో సాగుభూమి మొదలయ్యేది ఇక్కడి నుంచే సెలయేరు లాంటి స్వర్ణముఖి కాలువ గట్టునే ఉన్నాఆ గ్రామాల రైతులకు పరిశ్రమలు గ్రహణంగా మారాయి. పరిశ్రమల వ్యర్థాలతో గ్రామాల్లోని పంట పొలాలు సారాన్ని కోల్పోయాయి. చివరికి భూగర్భ జలాలు కలుషితం కావడంతో బోర్ల నుండి వచ్చే తాగునీటిని సైతం తాగలేని దయానీయ పరిస్థితి నెలకొంది.

కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో ఏర్పేడు మండలంలోని చెన్నంపల్లి, కొత్తకాల్వ, పెన్నగడ్డం, పెనుమల్లం, పాపానాయుడు పేట, గుడిమల్లం, ముసలిపేడు, గోవిందవరం గ్రామాలతో పాటు వడమాల పేట మండలంలోని కల్లూరు, రేణిగుంట మండలంలోని నల్లపాడు గ్రామాల్లో నీటి కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఏడాదికోసారి వర్షపు నీటితో స్వర్ణముఖి, నక్కలవంక వాగు పొంగుతుందో లేదోగానీ నిత్యం ఈ వాగుల్లోకి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థపు నీరు మాత్రం సెలయేళ్ళను తలపిస్తూ ప్రవహిస్తుంటుంది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అశ్రద్ద, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామాల్లోని ప్రజలు సహజసిద్దమైన గాలిని పీల్చుకోలేక, నీరును వాడుకోలేక పరాయి గడ్డపై నీళ్ళకోసం ఎదురు చూస్తున్నారు. గాజులమండ్యంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను సేకరించి పారిశ్రామికవాడను స్థాపించింది. ఆ తరువాత దాని చుట్టుప్రక్కల చకచకా సుమారు 20 చిన్నా, పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఉపాధి దొరుకుతుందని రైతులు సంబర పడ్డారు. కానీ వారి సంబరం మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు చుట్టుపక్కల గ్రామాలలోని గాలిని, నీటిని కలుషితం చేస్తూ ఉపాధి కల్పన మాటున ఊళ్ళను కబళించేస్తున్నాయి.

ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనాలతో గ్రామాల్లో రైతులు గుక్కెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఆఖరికి పొలాలు పండించడానికి సైతం పొరుగూర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారినా తమ గోడును ఎవరూ పట్టించుకోవడంలేదని గాజుల మండ్యం పారిశ్రామికవాడ పరిసర గ్రామస్థులు వాపోతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన పరిశ్రమల వ్యర్థాలతో దుర్గంధంతో పాటు తాగు, సాగునీరు కరువై జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Web Titlevillagers fear from the rain in Chittor district Andhra Pradesh
Next Story