టీడీపీకి వలసల చిక్కులు.. ఒక్కొక్కరుగా వీడుతోన్న సీనియర్లు

టీడీపీకి వలసల చిక్కులు.. ఒక్కొక్కరుగా వీడుతోన్న సీనియర్లు
x
Highlights

ఒక వైపు ఇంకా మరచిపోలేని ఘోర పరాజయం మరో వైపు జారిపోతున్న క్యాడర్. ఎంత సమర్ధవంతంగా నాయకత్వ బాధ్యతలు నెరవేరుస్తున్నా కరోనా కారణంగా స్వయంగా...

ఒక వైపు ఇంకా మరచిపోలేని ఘోర పరాజయం మరో వైపు జారిపోతున్న క్యాడర్. ఎంత సమర్ధవంతంగా నాయకత్వ బాధ్యతలు నెరవేరుస్తున్నా కరోనా కారణంగా స్వయంగా నేతలను కలవలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత రాష్ట్రంలో ఎంత వరకు తన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయపార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రతిపక్ష పాత్ర కరెక్టు గానే పోషిస్తున్నారా..? అంటే అవును అని కానీ అలా అని కాదు అని కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికల ముందు అంటే అధికారం ఉంది కాబట్టి భిన్న స్వరాలు ఉన్న నేతలు పెద్దగా బయటపడలేదు. కానీ ప్రస్తుతం అలా కాదు ఓటమి తరువాత ఏమైనా పొరపాటు ఉంటే బహిరంగగానే చెప్తున్నారు పార్టీ సీనియర్లు. కొందరు లోకేష్ నాయకత్వంలో పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది వైసీపీ అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నాం అంటున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని, ప్రతిపక్ష పాత్రను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. కొందరి నోట టీడీపీ పనైపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్యాడర్ ను కదిలించే పనిలో పార్టీ అధినేత చంద్రబాబు ముమ్మర ప్రయత్నమే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబుకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు. ఇప్పుడు ఆ అనుభవం, ఆ క్రమశిక్షణ ఎక్కడా కనిపించటం లేదు. అనుభవం జూమ్ మీటింగ్ లకు మాత్రమే పరిమితమైందని క్రమశిక్షణ అధికార పార్టీ వైపు పరుగులు పెడుతుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే నాయకులు పోయినా కార్యకర్తలు పార్టీ బలం అంటున్నారు చంద్రబాబు. కానీ ఆ బలం కూడా సీనియర్ నేతల వెంటే వెళ్తుంది. ఇలా ఈ మధ్య క్షేత్రస్థాయిలో వలసలు పెరుగుతుండటం పార్టీ కేడర్‌ను దెబ్బతీస్తోంది.

ఎక్కువ శాతం నేతలు అధినేతకు పెరుగుతున్న వయస్సు, కేసుల భయంతో పార్టీలో ఇమడలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదేకాక చినబాబు నాయకత్వంలో ఉండలేక పార్టీ విడుతున్న నేతలు కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ ను కదిలించాలని అధినేత ప్రయత్నాలు చేస్తున్నా సమావేశాలకు డుమ్మా కొడుతున్న నేతలు కూడా ఎక్కువయ్యారు. దీంతో కేడర్‌ను కాపాడుకోవటం పసుపు పార్టీకి పరీక్షగా మారింది. ఎన్నికలు జరిగిన 15నెలల్లోనే ప్రతిపక్షం ఈ విధంగా ఉంటే రానున్న మిగిలిన మూడేళ్లలో పార్టీ పరిస్థితి ఎలా మారుతుందనేది తెలుగు తమ్ముళ్లకు ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories