Nellore: అపోహలు ప్రచారంచేస్తే కఠిన చర్యలు: ఆరోగ్య శాఖాధికారి

S. Srikanth
Published on: 20 March 2020 7:02 PM IST
Nellore: అపోహలు ప్రచారంచేస్తే కఠిన చర్యలు: ఆరోగ్య శాఖాధికారి
X
Doctor Venkata Ramana

నెల్లూరు: ప్రాణాంతక కరోనా వైరస్ నగరంలో ప్రబలకుండా పటిష్టమైన నివారణా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాధి తీవ్రతపై ఎవరైనా అపోహలు ప్రచారం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ మాధ్యమాల ద్వారా వైద్యులు సూచిస్తున్న విధానాలను పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.

నివారణా చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్, జిమ్, క్రీడా ప్రాంగణాలు, పురమందిరం వంటి జన సమీకరణ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయించామని, హోటళ్లు, బార్లు, ఫంక్షన్ హాళ్లలో పరిశుభ్రతా ప్రమాణాలను పెంచామని వివరించారు. విదేశాల నుంచి ఇటీవల వచ్చిన వారిని గుర్తించి, వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నామని, పాజిటివ్ గా రిపోర్టులు వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మెరుగైన తర్వాతే వారిని తిరిగి జనజీవనంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని కొద్దిరోజులు ఇంటికే పరిమితమయితే వైరస్ సోకే అవకాశమే ఉండదని పేర్కొన్నారు.

అత్యవసర ప్రయాణాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నగర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులలో ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా పిచికారీ చేయిస్తున్నామని డాక్టర్ వెల్లడించారు. ఇలాంటి నేపధ్యంలో కరోనా వ్యాధి వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్లు, కంప్యూటర్లలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తక్షణమే వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు.


S. Srikanth

S. Srikanth

Next Story