వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు

వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు
x
Highlights

ఒకే ఒక్క ఎన్నిక ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది,ఇన్నాళ్లూ తిరుగులేని అధికారంతో వ్యవహరించిన తెలుగు దేశం ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు...

ఒకే ఒక్క ఎన్నిక ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది,ఇన్నాళ్లూ తిరుగులేని అధికారంతో వ్యవహరించిన తెలుగు దేశం ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది, ప్రతిపక్షంలో ఉండగా గొంతు నొక్కేశారని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు అధికార పక్షమైంది. మరిప్పుడు ఏపీ అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుంది?

ఓడలు బండ్లయ్యాయి బండ్లు ఓడలయ్యాయి, ఏపీ అసెంబ్లీలో బొమ్మ తిరగబడింది, ఒకే ఒక్క ఎన్నికతో అధికారం ప్రతిపక్షమైంది ప్రతిపక్షం అధికారపక్షమైంది, రాజకీయ ముఖచిత్రం ఇంత సమూలంగా మారిపోయిన పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలివి, ఇన్నాళ్లూ అధికార పక్షంలో ఉండి అనర్గళ ఉపన్యాసాలతో, ప్రతిపక్షాన్ని కవ్వించి, రెచ్చగొట్టి ఏక బిగిన విమర్శలతో చెలరేగిన తెలుగు దేశం ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమిత మైంది. 102 మంది సభ్యుల బలం కాస్తా 2019 నాటికి 23 కి పడిపోయింది.

అప్పట్లో తెలుగు దేశం ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు అధికారం అందించిన ధీమా, ఒక్కోసారి అత్యుత్సాహంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలుగు దేశం ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యాన్ని, ఆధిక్యాన్ని చూపారు. ప్రతిపక్షమూ ఎక్కడా తగ్గలేదు అందుకు దీటుగానే బదులిచ్చింది. సస్పెన్షన్లు సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. అది హోదా అయినా, బడ్జెట్ సమావేశాలైనా, ఇద్దరి మధ్యా ఇండియా, పాకిస్థాన్ వన్డే మ్యాచ్ అంత హీట్ కనపడేది. అసెంబ్లీ సమావేశాల లైవ్ కవరేజ్ అంత ఆసక్తిని రేకెత్తించేది.

ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపిన ప్రతీసారి ప్రతిపక్షాలపై అప్పటి ప్రభుత్వం చెలరేగిపోయేదన్నది వైసీపీ ఆరోపణ. ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వకుండా మైకులు కట్ చేసి ఏకపక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం సభ నిర్వహించిందన్న ఆరోపణలున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే మైకు ఇవ్వనంత మూర్ఖంగా తెలుగు దేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ మీడియా ముఖంగా అనేక సార్లు చెబుతూ వచ్చింది. జగన్ మాట్లాడుతున్న సమయంలోనే మైక్ కట్ చేసి అనేక సార్లు ఆయన్ను అవమానించారని, ప్రధాన ప్రతిపక్ష నేతకే ఆ పరిస్థితి ఉంటే ఇక మామూలు ఎమ్మెల్యేల పరిస్థితి ఊహించుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించేవారు.

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతోందన్న ఆరోపణలతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసింది. ఏడాదిన్నర కాలం పాటూ జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు ప్రజా సమస్యలను లేవనెత్తే వీలు కల్పించడం లేదంటూ ఆయన ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజల మధ్యకు వెళ్లారు తానే పరిస్థితుల్లో పాదయాత్రకు వచ్చినది ప్రజలకు వివరిస్తూ సాగారు.

ప్రతిపక్షం నోరు అధికార పక్షం నొక్కేస్తోందంటూ వైసీపీ చేసిన ప్రచారం బలంగానే ప్రజల్లోకి వెళ్లింది. చివరకు ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది. అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ప్రతిపక్షం ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని అధికారాన్ని సంపాదించింది. మరిప్పుడు వైసీపీ ఎలా వ్యవహరిస్తుంది? తిరుగులేని సంఖ్యాబలంతో అధికారం పొందిన జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమిస్తుందా లేక బదులుకు బదులు తీర్చుకుంటుందా? ఇది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories