Indukurpeta: ఆరోగ్య సమస్యలతో చనిపోవాలనుకున్న వృద్దుడిని కాపాడిన పోలీసులు

వృద్ధాప్య చివరి దశలో అనారోగ్య సమస్యలతో విసిగిపోయి, తనువు చాలించాలని ప్రయత్నించిన ఓ వృద్ధుడిని పోలీసులు రక్షించారు.

S. Srikanth
Updated on: 16 March 2020 12:15 PM IST
Indukurpeta: ఆరోగ్య సమస్యలతో చనిపోవాలనుకున్న వృద్దుడిని కాపాడిన పోలీసులు
X
Police saved old man

ఇందుకూరుపేట: వృద్ధాప్య చివరి దశలో అనారోగ్య సమస్యలతో విసిగిపోయి, తనువు చాలించాలని ప్రయత్నించిన ఓ వృద్ధుడిని పోలీసులు రక్షించారు. ఇందుకూరుపేట పోలీసులు తెలిపిన వివరాలు...అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామానికి చెందిన చెన్నుగారి చెన్నారెడ్డి (84), శుక్రవారం గ్రామం నుంచి నెల్లూరుకు వచ్చేశారు. ఆదివారం ఉదయం మైపాడుబీచ్‌కు వచ్చి, స్థానిక శివాలయం వద్ద ఓ దుకాణం వారికి రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు రూ.50లు బాకీ పడగా, యాభైకి యాభై కలిపి మొత్తం రూ.100 ఇచ్చారు. అనంతరం బీచ్‌ ఒడ్డుకు వెళ్లి తన వద్ద ఉన్న చరవాణి ఆన్‌ చేశారు.

వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి చనిపోదామని నిర్ణయించుకున్నారు. అయితే తన తండ్రి కనిపించలేదని, 13వ తేదీన చెన్నారెడ్డి కుమారుడు ఎల్లనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడి ఫోన్‌నంబర్‌ను ఎల్లనూరు పోలీసులు పరిశీలించగా, మైపాడుబీచ్‌లో ఉన్నట్లు లొకేషన్‌ తెలిసింది. వెంటనే వృద్ధుడి ఫొటో, ఇతర వివరాలను ఇందుకూరుపేట ఎస్సై నరేష్‌కు పంపారు. ఆయన సిబ్బందితో కలసి బీచ్‌లో గాలిస్తూ... పురుగుల మందు తాగేందుకు ప్రయత్నిస్తు వృద్ధుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ ద్వారా ఫొటోలు పంపారు.

కుటుంబ సభ్యులు గుర్తుపట్టి తీసుకెళ్లేందుకు అనంతపురం నుంచి నెల్లూరు వస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. మూడేళ్ల క్రితం తన భార్య మృతి చెందటం, అనారోగ్య సమస్యలతో చనిపోవాలని ఈ ప్రయత్నం చేసినట్లు బాధితుడు చెన్నారెడ్డి చెప్పారు. సాంకేతికతను వినియోగించి సకాలంలో స్పందించి, వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.


S. Srikanth

S. Srikanth

Next Story