Konaseema is in August Threat: కోనసీమకు ఆగస్ట్ భయం

Konaseema is in August Threat: కోనసీమకు ఆగస్ట్ భయం
x
Highlights

Konaseema is in August threat: పచ్చని కోనసీమను ఇప్పుడు ఆగస్ట్ భయం వణికిస్తోంది. ఒక పక్క కరోనా మహమ్మారి వెంటాడుతుంటే మరో వైపు ప్రతీ ఏటా...

Konaseema is in August threat: పచ్చని కోనసీమను ఇప్పుడు ఆగస్ట్ భయం వణికిస్తోంది. ఒక పక్క కరోనా మహమ్మారి వెంటాడుతుంటే మరో వైపు ప్రతీ ఏటా ఆగస్ట్ లో సంభవించే వరద కోనసీమ వాసుల్లో గుబులు పుట్టిస్తోంది. అనివార్యమైన వరదలు అనుకోకుండా వచ్చిపడిన కరోనా విపత్తు ఆందోళన కలిగిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రకృతి సహజసిద్ధ అందాలకు పెట్టింది పేరు భూమికి పచ్చని రంగేసినట్టుండే పొలాలు హొయలొలికిస్తూ ప్రవహించే గోదావరి పరవళ్లు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. ప్రతీ ఏటా ఆగస్ట్ లో గోదావరికి వచ్చే వరదలు ఈ సారి కోనసీమ వాసులను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఏటా చూసే వరద ఒక ఎత్తైతే ఈసారి వచ్చే వరద మరో ఎత్తు అంటున్నారు లంక గ్రామస్తులు. వరద సమయంలో గ్రామాలను ముంచెత్తే నదీ పాయల మధ్యలో ఉండే లంక గ్రామాల ప్రజలు ఎన్నో వరదలను చూసారు. వరద సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు జనజీవనం స్థంభిస్తుంది. ఈ క్రమంలో అధికారులు లంక గ్రామాలు వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. వరద ప్రభావం తగ్గే వరకు జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రాల్లోనే తల దాచుకుంటారు. ఇక్కడే అసలు భయం కోనసీమ వాసులను వెంటాడుతోంది ఇబ్బడి ముబ్బడిగా జనాన్ని ఒకే చోట పునరావాస కేంద్రాల్లో ఉంచితే కరోనా రక్కసి మరింత విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో ఎన్నడూ లేనంతగా వరద గోదావరికి వచ్చి చేరింది గడచిన మూడు దశాబ్ధాల తరువాత అంతటి వరదను చూసారు కోనసీమవాసులు. వరద సమయాల్లో రవాణ వ్యవస్ధ లేని కొన్ని లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ఇప్పటికి రాకపోకలు సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐ పోలవరం మండలం పశువుల్లంక రేవులో బోటు మునిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధులు ఓ మహిళ మృతి చెందగా ఒక విద్యార్ధిని మృత దేహం ఆచూకి ఇప్పటికి లభించలేదు ఆ ప్రమాదం తరువాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పశువుల్లంక వద్ద యుధ్దప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టింది. అయితే కోటిపల్లి - ముక్తేశ్వరం.. కనకాయలంక, ఊడుమూడిలంక.. వంటి లంక గ్రామాల ప్రజలు ఇప్పటికి నాటు పడవలనే వినియోగిస్తున్నారు. మామిడికుదురు మండలం అప్పన్నపల్లి ఐనవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్ వే లు ప్రతీ ఏటా వరద ముంపునకు గురువుతూనే ఉంటాయి. ఐనవిల్లి మండలం లోని ఐనవిల్లిలంక, వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక గ్రామాలు వరద సమయంలో పూర్తిగా నీటమునిగి ఉంటాయి. ఐ.పోలవరం మండలంలోని గురజాపులంక లంక ఆఫ్ ఠానే లంక గ్రామాలది అదే పరిస్థితి గత ఏడాది రికార్డు స్దాయిలో వచ్చిన వరదకు ఈ గ్రామాలన్ని సుమారు 45 రోజుల పాటు వరద తీవ్రత ఎదుర్కొన్నాయి వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఎటపాక.. కూనవరం.. దేవిపట్నం.. సీతానగరం మండలాలు వరద ప్రభావానికి అతలాకుతలమయ్యాయి.

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వచ్చే వరదల నుంచి ఎలా బయట పడాలని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినా అక్కడ కిక్కిరిసిపోయిన జనం మధ్యలో ఎవరి వల్ల ఎవరికి కరోనా వ్యాపిస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేపట్టి రవాణ ఆహారం మందులు సిధ్దం చేయాలని కోనసీమవాసులు కోరుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories