logo
ఆంధ్రప్రదేశ్

Kacchaluru boat accident: కచ్చలూరు బోటు ప్రమాద విషాదానికి ఏడాది! నిలిచిపోయిన పర్యాటకం!!

Kacchaluru boat accident: కచ్చలూరు బోటు ప్రమాద విషాదానికి ఏడాది! నిలిచిపోయిన పర్యాటకం!!
X
Kaccahluru boat accident file image
Highlights

Kacchaluru boat accident:గోదారమ్మ అందాలు చూద్దామని వారంతా బయలుదేరారు. ఎంతో సరదాగా రాయల్ వశిష్ట బోటు ఎక్కిన వారికీ అప్పుడు తెలీదు తాము కాసేపట్లో ప్రమాదంలో పడిపోతామని. వారెక్కిన బోటు కొద్దిసేపటిలోనే గోదారి సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. వారి కుటుంబాల్లో పెనువిషాదాన్ని నింపింది.

సరిగ్గా సంవత్సరం అయింది. పశ్చిమగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద పర్యాటక లాంచీ ప్రమాదానికి గురయింది. పాపికొండల అందాలు చూద్దామని వెళ్ళిన 51 మంది జలసమాధి అయ్యారు. గత సెఫ్టెంబర్ 15వ తేదీ 12.30 గంటలు రాయల్‌ వశిష్ఠ పర్యాటకుల బోటు మునక. పాపికొండలు చూసేందుకు వశిష్ట బోటుపై ఆంధ్ర, తెలంగాణలకు చెందిన 77 మంది పర్యాటకులు బయల్దేరారు. లాంచీ దేవీపట్నం దాటాక కచ్చులూరు కొండ(మందం) వద్ద వరద సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. పడవలపై వెళ్లి 26 మందిని కచ్చులూరు, తూటిగుంట గిరిజనులు రక్షించారు. మిగిలిన 51 మందిలో 46 మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. ఇక మిగిలిన 5 గురి ఆచూకీ దొరకలేదు.

ప్రమాదం జరిగింది ఇలా..

మొత్తం 77 మంది పర్యాటకులతో బయలు దేరిన రాయల్ వశిష్ట బోటు కచాలూరు వద్ద సుడిగుండంలో చిక్కుకుంది. దేవీపట్నం మండలం కచలూరు దగ్గర తరచీ సుడిగుండాలు సంభవిస్తుంటాయి. అదే మాదిరిగా రాయల్ వశిష్ట లాంచీ సుడిగుండంలో చిక్కుకుని బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై విశ్లేషిస్తున్న జలవనరుల శాఖ అధికారులు కూడా అదే చెప్పారు. పర్యాటకంగా ఎంతో ప్రసిద్ది చెందిన పాపికొండలు. ఎప్పటి నుంచో పాపికొండల ప్రయాణం చేస్తుంటారు. దశాబ్దాలుగా రాజమహేంద్ర వరం నుంచి భద్రాచలం వరకు జలమార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుండి. అయితే, దేవీపట్నం మండలం పోశమ్మ గుడి నుంచి పాపికొండల వరకు 62 కిలో మీటర్ల దూరంలో ఎక్కడా ప్రమాద పరిస్థితులు తెలియచేస్తూ హెచ్చరిక సూచికలు కూడా లేకపోవడం కూడా విహారయాత్రలు విషాదయాత్రలుగా మారిపోయిన సంఘటనలు చోటుసుసుకున్తున్నాయి. రాజమహేంద్ర వరం, పట్టిసీమ, సింగనపల్లి, పోశమ్మ గుడి నుంచి పాపికొండల వరకు ప్రయణించే సమయంలో నీటి ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్లాల్సి ఉంటుంది. ముందుకు వెళ్తున్నా కొద్దీ కొండల మధ్య గోదావరి సన్నగా ప్రవహిస్తుంటుంది. కొండ అడ్డుగా ఉండటంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి సుడిగుండంలో చిక్కుకున్న వెంటనే లాంచీలు పెద్ద పెద్ద బండరాళ్లను ఢీకొని బోల్తాపడటం కానీ.. రంద్రం పడి నీరు లోపలికి వచ్చే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖ నిపుణులు చెప్పారు. కచ్చులూరు దగ్గర గోదావరి వరద ప్రవాహం వడి.. సుడి కలిసి రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి దారి తీసినట్లుగా అధికారులు నిర్ధారించారు.

బోటు కోసం విశ్వయత్నాలు..

గోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ప్రమాదం జరిగిన కచ్చులూరు దగ్గర లంగరేసి వెతికిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు 150 అడుగుల లోతులో బోటు ఆనవాళ్లు దొరికాయి. మొదట సులువుగా బోటును బయటకు తీయొచ్చని భావించారు. కానీ, తరువాత దానిని వెలికితీయడం మరింత పెద్ద సమస్యగా మారింది. లాంచీని బయటకు తీయడానికి హై ఎండ్ టెక్నాలజీని అధికారులు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్ నుంచి సైడ్ స్కాన్ సోనార్ పరికరాన్ని తెప్పించి నదీగర్భంలోకి జారిపోయిన వశిష్ట బోటు ఎంత లోతులో ఉన్నదీ తెలుసుకోడానికి ప్రయత్నించారు.

పదమూడు రోజుల పాటు అనేక ప్రయత్నాలు చేసినా లాంచీ వెలికి తీయలేకపోయారు. దీంతో బోటును వెలికితీసే బాధ్యతను బాలాజీ మెరైన్స్ అప్పగించారు. బోటును వెలికితీసేందుకు గాను 22.70 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. బాలాజీ మెరైన్స్‌కి 35 ఏళ్ల అనుభవం ఉందని... ఇప్పటికే బోటు గల్లంతైన ప్రాంతంలో బాలాజీ మెరైన్స్ పనులను ప్రారంభించిందనీ తూర్పు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ప్రకటించారు. పదమూడు రోజుల్లోనూ 36 మృతదేహాలను వెలికితీశారు... గల్లంతైన 16 మంది కోసం గాలింపు కొనసాగించారు.

ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు..

తరువాత రెండు రోజులకు ఇటువంటి బొట్లను వెలికి తీయడంలో అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం బోటును గుర్తించి అక్కడ ఐదు లంగర్లు వేసింది. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకోవడంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావించారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌లను ప్రొక్లెయినర్‌తో ఒద్దు వైపుకు లాగే ప్రయత్నాలు చేశారు సత్యం బృందం. లంగరు తగలగానే దాని చుట్టూ ఐరన్ రోప్ తో లాక్ చేసిన ధర్మాడి సత్యం టీమ్ ఆపై బయటికి లాగే ప్రయత్నంలో విఫలమైంది. అధిక బరువు కారణంగా ఐరన్ రోప్ మధ్యలోనే తెగిపోయింది. అంత లోతున బోటు కాకుండా మరే ఇతర వస్తువు ఉండే అవకాశం లేదని, అది బోటే అయ్యుంటుందని ధర్మాడి సత్యం భావించారు. అయితే 25 టన్నుల బరువున్న ఆ బోటు, గోదావరి వరద కారణంగా ఇసుకతో నిండిపోయి మరింత బరువెక్కి ఉంటుందని అంచనా వేశారు. అందుకే రోప్ తెగిపోయి ఉంటుందని, అసలు నీటి అడుగున ఓ బరువైన వస్తువు ఉన్నట్టు గుర్తించడం సగం విజయంతో సమానమని వెలికితీతలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలంలో వర్షం పడుతుండడంతో వెలికితీత పనులకు ఆటంకం కలిగుతూ వచ్చింది. తరువాత పదిరోజుల పాటు గోదావరికి వరద వచ్చిన కారణంగా బోటు వెలికి తీత పనులు నిలిచిపోయాయి. తిరిగి అక్టోబర్ 14న ధర్మాది బృందం బోటు వెలికితీతకు ప్రయత్నాలు ప్రారంభించింది..

మరో రెండురోజుల తరువాత ధర్మాడి సత్యం టీమ్‌ వేసిన లంగరుకు బోటు చిక్కింది. అయితే, లంగరును లాగుతుండగా బోటు ముందుకు కదిలినా, అంతలోనే లంగరు పట్టువదిలేసింది. నేరుగా లంగరు వేయగలిగితేనే బోటు బయటికి తీయగలగమని అంచనా వేసిన ధర్మాడి సత్యం నదీగర్భంలోకి వెళ్లి నేరుగా బోటుకు లంగరు వేసేందుకు విశాఖ నుంచి గత ఈతగాళ్లను రప్పించారు.

ఈసారి వాళ్ళ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలించాయి. ప్రమాదం జరిగిన 38 రోజులకు అక్టోబర్ 22న బోటును ధర్మాడి బృందం వెలికితీయగలిగింది. బయటకు వచ్చిన బోటులో మరికొన్ని మృతదేహాలను గుర్తుపట్టలేని స్థితిలో వెలికి తీశారు.

మొత్తమ్మీద ఈ ప్రమాదంలో గల్లంతైన 51 మందిలో 46 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఐదుగురి జాడ తెలియలేదు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పర్యాటక బొట్లను నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో సంవత్సరం గడిచిపోయినా అక్కడ పర్యాటక బోట్లకు ఇప్పటివరకూ అనుమతి ఇవ్వలేదు. దీంతో పాపికొండల అందాల్ని చూసే అదృష్టం పర్యాటకులకు దూరం అయింది.

Web TitleKacchaluru boat accident one year completed to the boat accident at kacchaluru andhrapradesh which death trolls 51in that accident
Next Story