YS Jagan: ముఖ్యమంత్రి జగన్ మరో వరం: చిన్నారుల దంత సంరక్షణ కోసం కొత్త పథకం!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం కాబోతోంది. 'డాక్టర్ వైఎస్‌ఆర్ చిరునవ్వు' పేరుతో 1 నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై జరిపిన సమీక్షా సమావేశంలో తెలిపారు. జులై 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి టూత్ పేస్ట్, బ్రష్ ఉచితంగా అందజేస్తామన్నారు. 60 లక్షల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ పథకానికి సంబంధించిన పలు వివరాలను అధికారులకు సూచనలు అందచేశారు. ''2 వేల మంది జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు తగ్గట్లు విలేజ్ క్లినిక్కులను ఏర్పాటు చేయాలి. వీటిలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ క్లినిక్‌లను పెట్టాలి. వీటిలో ప్రాథమిక వైద్య సేవలు అందించడంతో పాటు... ఇక్కడికి వచ్చే వారి అనారోగ్య తీవ్రత అనుసరించి పెద్దాసుపత్రులకు పంపేలా చర్యలు తీసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు. కంటి వెలుగు పథకం తరహాలో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ దంత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బోధనాసుపత్రి ఉండాలని, వీటి ద్వారా వైద్యుల కొరతను అధిగమించవచ్చని అన్నారు. బోధనాసుపత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వీటిలో దంత వైద్య విద్యనూ బోధించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు సవివర ప్రాజెక్టు నివేదికలు తయారు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. కంటి వెలుగు పథకం అమలుతీరు గురించి తెలిపారు. సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు.




