నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సభలో పెను విషాదం

Nellore: 8 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Jyothi
Published on: 29 Dec 2022 6:19 AM IST
Big Tragedy in Chandrababu Sabha in Nellore District
X

నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సభలో పెను విషాదం

Nellore: నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీగా తరలి వచ్చిన జనం, కార్యకర్తల ఉత్సాహం మధ్య జరగాల్సిన బహిరంగ సభ.. సంతాప సభగా మారింది. కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కందుకూరు వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వారంతా ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని గుండంకట్ట వీధిలోకి నెట్టుకుంటూ వెళ్లారు. అప్పటికే అక్కడ జనం ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలపై కొందరు పడిపోగా, వారిపై మరికొందరు పడ్డారు. తొక్కిసలాటలో డ్రైనేజీలో జారిపడిపోయారు. దాంతో ఊపిరాడక కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

చంద్రబాబు ప్రసంగం ప్రారంభం నుంచి తమ కార్యకర్తలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కార్యకర్తలు ఉత్సాహం తగ్గించుకోవాలని, సభ విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని కోరారు. జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలను పదే పదే హెచ్చరించారు. అయినప్పటికీ ఈ దుర్ఘటన జరగడంతో దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు ప్రసంగం ఆపేసి.. ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడారు.

ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన చంద్రబాబు.. అనంతరం రోడ్ షో ప్రాంగణానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల మరణం తీరని విషాదంగా అభివర్ణించిన చంద్రబాబు.. విధిని ఎవరూ తప్పించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పార్టీ నుంచి 10 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ మృతుల కుటుంబాలకు అండగా ఉండి.. అంత్యక్రియలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు.

క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తం 14 మందిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. మృతుల్లో చినకొండయ్య, కాకుమాని రాజా, దేవినేని రవింద్రబాబు, యాటగిరి విజయ, కలవకూరి యానాది, యు.పురుషోత్తం, గడ్డం మధుబాబు, రాజేశ్వరి ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story