పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన సీఎం జగన్‌

పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన సీఎం జగన్‌
x
Highlights

తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.... స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఒక కన్ను పరిపాలనపై... మరో కన్ను పార్టీపై పెడుతున్న ముఖ్యమంత్రి...

తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.... స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఒక కన్ను పరిపాలనపై... మరో కన్ను పార్టీపై పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి... క్షేత్రస్థాయిలో కేడర్‌‌ను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే జిల్లాల వారీగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, కిందిస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఎంత...అధికారంలో ఉన్నా... ఒక రాజకీయ పార్టీకి క్యాడరే బలం. అధినాయకుడితోపాటు నాయకులు, కార్యకర్తలు సమపాళ్లలో పనిచేస్తేనే ఆ పార్టీ నాలుగు కాలాలపాటు పచ్చగా ఉంటుంది. అందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి... పాలనా వ్యవహారాలతో బిజీగా ఉన్నప్పటికీ, పార్టీపైనా ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టైమ్‌ దగ్గర పడుతుండటంతో, ఒక కన్ను పరిపాలనపై... మరో కన్ను పార్టీపై పెడుతున్నారు. ము‌ఖ్యంగా పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది... ఏం చేస్తే పుంజుకుంటుందనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డికి జగన్‌ అప్పగించారు. ముందుగా వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేయడం, తర్వాత మండలస్థాయి, జిల్లాస్థాయి నాయకులను నియమించి, లోకల్ కేడర్‌‌ను పటిష్టం చేయాలని భావిస్తున్నారు. అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, పార్టీ కేడర్‌‌ బలోపేతానికి చర్యలు తీసుకోనున్నారు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించి అఖండ విజయం సాధించినప్పటికీ, ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం కూడా దాదాపు 40శాతం మేర ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం పుంజుకోకుండా, ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించినట్లుగానే, స్థానిక సంస్థల్లో కూడా అన్ని మున్సిపాలిటీలను, పంచాయతీలను కైవసం చేసుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పార్టీ కేడర్‌‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories