Parkal: పరకాల అమరధామాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు!
Parkal: పరకాల అమరధామాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సందర్శించి అమరులకు నివాళులర్పించారు.
Parkal: పరకాల అమరధామాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు!
పరకాల: తెలంగాణ విమోచన చరిత్రను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మరుగునపరచే ప్రయత్నాలను ప్రజలు సహించరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు రామచంద్రరావు అన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం రాజకీయాలకు అతీతమైన విషయమని, వారి చరిత్రను విస్మరించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు.
వందేమాతరం గీతం నాటి విమోచన పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని, అలాంటి దేశభక్తి గీతంపై కాంగ్రెస్ వైఖరి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం విమోచన చరిత్ర విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో అమరవీరుల త్యాగాలను స్మరించే కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి పగడాల కాళీప్రసాదరావు మాట్లాడుతూ మరో రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించి అమరవీరులకు అసలైన నివాళులు అర్పిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్తినేని ధర్మారావు, రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, పెసరు విజయచందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రుద్రమదేవి, ఎర్రం రామన్న, గురుప్రసాద్, ప్రసాదరావు, జయంత్‌లాల్, మండల అధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.