Parvathipuram: సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి సిపిఐ డిమాండ్
Parvathipuram: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ మన్యం జిల్లా నాయకులు ఆర్వీఎస్ కుమార్, ఈవీ నాయుడు డిమాండ్ చేశారు.
Parvathipuram: సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి సిపిఐ డిమాండ్
పార్వతీపురం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరి సుమారు ఏడేళ్లు పూర్తవుతున్నా వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్, ఈ.వి నాయుడు విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా, వ్యవస్థ పేరు మారుతున్నా సచివాలయ ఉద్యోగుల తలరాత మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందించాలనే ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని వారు తెలిపారు. గ్రామపంచాయతీల పరిధిలో 21 కేటగిరీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 10 కేటగిరీలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించారని చెప్పారు. అనేక ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ, ఉద్యోగుల సమస్యలను మాత్రం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
లక్షలాది మంది నిరుద్యోగులతో పోటీపడి ఎపిపిఎస్సీ నిర్వహించిన గ్రూప్ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సచివాలయ ఉద్యోగాల్లో చేరిన వారు గత ఏడేళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. నియామక సమయంలో రెండేళ్ల ప్రొబేషన్ కాలానికి నెలకు రూ.15 వేల కంసాలిడేటెడ్ పే చెల్లించే విధంగా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. 24 నెలల ప్రొబేషన్ కాలంలో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండా, ఆయా కేటగిరీలకు నిర్దేశించిన శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగుల సర్వీసును ప్రొబేషన్ పూర్తయిన వెంటనే రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
దీంతో ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో 2022 జూన్ 30న శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై, సర్వీసులో ఎలాంటి రిమార్కులు లేని ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తయినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించి, వారి సర్వీసును రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేశారు. 2022 జూలై 1 నుంచి రెగ్యులర్ చేసిన ఉద్యోగులకు పూర్తి పేస్కేల్‌తో కూడిన వేతనాలను అమలు చేశారని తెలిపారు.
అయితే వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2021 అక్టోబర్ 1 నాటికే పూర్తికావాల్సి ఉండగా, తొమ్మిది నెలల ఆలస్యంగా 2022 జూన్ 30న ప్రొబేషన్ పూర్తయినట్లు ప్రకటించడంతో ఆ తొమ్మిది నెలల కాలానికి పూర్తి స్థాయి వేతనాలను ఉద్యోగులు కోల్పోయారని ఆర్వీఎస్ కుమార్, ఈ.వి. నాయుడు తెలిపారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.