Gummalakshmipuram: అరుదైన గుండె వ్యాధితో మూడేళ్ల చిన్నారి పోరాటం – దాతల సాయం కోసం నిరీక్షణ

Gummalakshmipuram: పార్వతీపురం మన్యం జిల్లా ఇచ్చాపురం గ్రామానికి చెందిన మూడేళ్ల గిరిజన చిన్నారి ఐశ్వర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

Update: 2026-08-22 11:11 GMT

Gummalakshmipuram: అరుదైన గుండె వ్యాధితో మూడేళ్ల చిన్నారి పోరాటం – దాతల సాయం కోసం నిరీక్షణ

గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇచ్చాపురం గ్రామానికి చెందిన మూడేళ్ల గిరిజన చిన్నారి ఐశ్వర్య అరుదైన గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేద గిరిజన కుటుంబానికి చెందిన ఐశ్వర్యకు చిన్న వయసులోనే గుండెలో రంధ్రం (హార్ట్ డిఫెక్ట్) ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తల్లిదండ్రులు రంజిత్, చామంతి తెలిపారు. చిన్నారి నడిచినా, పరిగెత్తినా త్వరగా అలసిపోతుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండె పనితీరులో సమస్య ఉందని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు.

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో చిన్నారికి మెరుగైన వైద్యం అందించలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితి వారిని మరింత కలవరపెడుతోంది.

చిన్నారికి అత్యవసర వైద్య పరీక్షలు, చికిత్స అవసరమని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

“మా బిడ్డను బ్రతికించండి.. సరైన ఆసుపత్రికి చేర్చి వైద్యం అందించండి” అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News