Anakapalli: పోలీసు శాఖలో 40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అధికారులకు ఘన వీడ్కోలు!

Anakapalli: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు

Update: 2026-06-30 09:55 GMT

Anakapalli: పోలీసు శాఖలో 40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అధికారులకు ఘన వీడ్కోలు!

అనకాపల్లి:  అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.

పోలీసు శాఖలో 35 నుంచి 40 సంవత్సరాల పాటు క్రమశిక్షణతో విధులు నిర్వహించిన *వి. వెంకటరమణ (ఎస్ఐ), పి. వెంకటేశ్వరరావు (ఏఎస్ఐ), పి. కేశవరావు (ఏఎస్ఐ), బి. అప్పారావు (ఏఎస్ఐ), పి. కొండలరావు (హెడ్ కానిస్టేబుల్), ఆర్. రాఘవులు (హెడ్ కానిస్టేబుల్), హెచ్.టి. నాయుడు (హెడ్ కానిస్టేబుల్)*లను అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు వృత్తి అత్యంత బాధ్యతాయుతమైనదని, ఒత్తిడితో కూడిన ఈ రంగంలో దశాబ్దాల పాటు ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేసిన అధికారులు శాఖకు గర్వకారణమని కొనియాడారు.

యువ పోలీసు సిబ్బందికి వారి క్రమశిక్షణ, సేవా తత్వం ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమైందని ప్రశంసిస్తూ, పదవీ విరమణ అనంతరం వారి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. విశ్రాంత జీవితంలోనూ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సత్కారం అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ సేవా కాలంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఇన్నేళ్ల పాటు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖ అనే కుటుంబం నుంచి దూరమవడం బాధాకరమైనప్పటికీ, ఇంతటి ఘనమైన వీడ్కోలు అందించడం జీవితాంతం మరువలేని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె. రవికుమార్, ఏఓ సి.హెచ్. తిలక్ బాబు, ఇన్‌స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, వెంకట చిట్టి, రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సేనం రమేష్, పిల్లా రమేష్, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News