Vijayawada: అభివృద్ధిలో ఐలా కీలక పాత్ర పోషించాలి ఎంపీ కేశినేని చిన్ని!

Vijayawada: ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని. ఆటోనగర్ అభివృద్ధిలో ఐలా కీలక పాత్ర పోషించాలని వసతుల కల్పనకు పూర్తి సహకారం హామీ.

Update: 2026-08-27 03:56 GMT

Vijayawada: అభివృద్ధిలో ఐలా కీలక పాత్ర పోషించాలి ఎంపీ కేశినేని చిన్ని!

Vijayawada: ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వినోద్ కోగంటి సత్యం రమేష్ చైర్మన్ అన్ని శివ నాగేశ్వరరావు వైస్ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుమారు లక్ష మంది కార్మికులు నివసించే ఆటోనగర్ ప్రాంతంలో ఐలా ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు.

గత ఐలా కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా ఐలా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిరంతరం పోరాటం చేశామని చెప్పారు. ఐలా ఎన్నికలు నిర్వహించాలంటే కలెక్షన్లు 60 శాతానికి పైగా ఉండాలని అధికారులు సూచించడంతో, అందరూ సమష్టిగా కృషి చేసి 60 శాతానికి పైగా కలెక్షన్లు సాధించి ఎన్నికలు నిర్వహించుకున్నారని తెలిపారు.

శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ ఎంపీ చిన్ని అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా శివనాగేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీగా కలామ్ ఎన్నిక కావడం అభినందనీయమన్నారు.

విజయవాడకు ఆటోనగర్ జీవనాడి వంటిదని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఆటోనగర్‌లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు తదితర సమస్యలు ఏవైనా ఉంటే ఐలా నాయకత్వం వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకువస్తే వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సీఆర్‌డీఏలో పోరాడి మూడు రోడ్ల టెండర్లను పూర్తి చేశామని, ఇప్పటికే ఆయా రోడ్ల పనులు జరుగుతున్నాయని ఎంపీ చిన్ని తెలిపారు. నాలుగో రోడ్డును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారని, శక్తి కళ్యాణ మండపం రోడ్డు కూడా సిద్ధమైందని చెప్పారు.

ఆటోనగర్‌కు 24 గంటల పాటు వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా, విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రజాప్రతినిధులందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఐలా మరింత విస్తృతంగా అభివృద్ధి చెందాలని, ఆటోనగర్‌లోని సుమారు లక్ష మంది కార్మికులకు దిశానిర్దేశం చేసే బలమైన వ్యవస్థగా ఎదగాలని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం ఆటోనగర్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు.

Tags:    

Similar News