Burning Topic: భారత్‌కు ముంచుకొస్తున్న ముప్పు!
Burning Topic: నేపాల్‌లో హిమనీనద సరస్సు బద్దలై సంభవించిన ఆకస్మిక వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారు. భారత్ అత్యవసర సహాయం అందజేసింది.
Burning Topic: భారత్‌కు ముంచుకొస్తున్న ముప్పు!
Burning Topic: నేపాల్ చరిత్రలోనే అత్యంత ఘోర విపత్తు ఇది. ప్రశాంతంగా ఉన్న హిమాలయ దేశం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. భోటెకోశీ నది ఒక్కసారిగా ఉప్పొంది సృష్టించిన మెరుపు వరదలు పెను విధ్వంసాన్నే సృష్టించాయి. టిబెట్‌లోని తిమురే ప్రాంతంలో లేండే ఖోలా నది ప్రవాహా మార్గంలో కొండ చరియ విరిగిపడటంతో ఏర్పడ్డ భారీ హిమపాత సరస్సు ఒక్కసారిగా బద్దలైంది. నిమిషాల వ్యవధిలో ఉప్పెనలా దిగువన నేపాల్‌కి దూసుకొచ్చింది. బురద, మంచు, రాళ్లతో కూడిన ఉగ్ర ప్రవాహం భోటే కోషి నదిలోకి, ఆపై త్రిశూలి నదిలోకి పోటెత్తింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నది నీటి మట్టం ఏకంగా 9 మీటర్ల మేర పెరిగిపోయి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఉత్తరాన రసువాగఢ్ సరిహద్దు క్రాసింగ్‌కు ఈశాన్యంగా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన హిమానీనద ప్రాంతంలో ఈ మొత్తం ఘటన చోటు చేసుకుంది.
ఈ భారీ ఆకస్మిక వరద దాటికి సరిహద్దు అవతల టిబెట్‌లోని గ్యిరాంగ్ పోర్ట్ ప్రాంతాలు.. సరిహద్దును ఆనుకొని ఉన్న నేపాల్‌లోని రసువా జిల్లా అత్యంత ఘోరంగా దెబ్బతింది. లేండే ఖోలా, భోటేకోశీ, త్రిశూలీ నదుల తీర ప్రాంతంలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న చిన్న బస్తీలు, జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్‌లు పూర్తిగా కొట్టుకుపోయాయి. స్యాప్రుబేసి పట్టణంలోని మార్కెట్లు, బహుళ అంతస్తుల భవనాలు బురదలో మునిగిపోయాయి. రెప్పపాటులో ఇళ్లు, వాహనాలు, రోడ్లు అన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే తిమురే గ్రామం పూర్తిగా అతలాకుతలమైంది. నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోని అనేక గ్రామాలు తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొన్నాయి. మొత్తం మీద 12 గ్రామాలు దెబ్బతిన్నగా సుమారు వేయి మంది దాకా గల్లంతయ్యారు. మరణాల సంఖ్య భారీగానే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున సంఖ్యలో స్పష్టత లేదు. ప్రకృతి విలయతాండవం వేలాది కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చింది.
కాగా నేపాల్ ప్రకృతి విలయంలో గల్లంతైన వారిలో 579 మంది పర్యాటకులే ఉన్నాయి. ఇందులో దాదాపు 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నిర్ధారించారు. ఈశా ఫౌండేషన్‌కు చెందిన దాదాపు 80 మంది గల్లంయ్యారు. వారు యాత్ర నుంచి తిరుగుపయనమై ఇమిగ్రేషన్ కార్యాలయంవద్ద ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషాదంపట్ల ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికిపైగా యాత్రకు వెళ్లి తిరిగి వచ్చారని, ఒక బ్యాచ్‌లోని వారే చిక్కుకుపోయారని వివరించారు. సహాయకచర్యల్లో సహకరించేందుకు వాలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రకృతి బీభత్సం నేపాల్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కీలక మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 12 జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. దీంతో నేపాల్‌లో అంధకారం నెలకొంది. అనేక వంతెనలు, రోడ్డు దెబ్బతిన్నాయి. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లను నేపాల్ సైన్యం వినియోగిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మంది కాఠ్‌మాండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్‌లో వరదల నేపథ్యంలో పొరుగున ఉన్న బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బిహార్‌లోని వాల్మీకి నగర్‌వద్ద ఉన్న బ్యారేజ్ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్‌గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో గండక్ నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక్కడ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
నేపాల్‌లో సంభవించిన భారీ ప్రకృతి విలయంపై భారత్ తక్షణమే స్పందించింది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భారత్ ఎప్పుడూ నేపాల్‌కు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అన్ని విధాలా మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. నేపాల్- భారత్ బృందాలు సహాయక చర్యల్లో సమన్వయంతో పనిచేస్తున్నాయని మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. భారత వాయుసేనకు చెందిన 'సీ-130జే' రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామగ్రిని అత్యవసరంగా నేపాల్‌కు తరలించారు. ఇందులో టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ లాంతర్లు, ప్రాణాలను రక్షించే ముఖ్యమైన మందులు ఉన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నేపాల్ జలప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే హిమనీ సరస్సు బద్దలవడంతో ఈ విపత్తు సంభవించినట్లు తాజాగా అమెరికా జియాలాజికల్ సర్వే తాజాగా వెల్లడించింది. భూకంప తరంగాలు, ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత హిమానీనదం కూలిపోవడం, దాని కారణంగా భారీగా శిథిలాలు కిందికి ప్రవహించడం వల్లే భూమిలో 4.4 తీవ్రత గల ప్రకంపనలు నమోదైనట్లు నిర్ధారించారు. సుమారు 5,200 మీటర్ల ఎత్తులో కొండ అంచు నుంచి హిమానీనదం జారిపడటం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని చెబుతున్నారు వాతావరణ పరిస్థితుల కారణంగా మంచు వేగంగా మంచు కరగడంతో హిమానీనదం ఒక్కసారిగా కూలింది. భారీగా మంచు, రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు దిగువకు దూసుకెళ్లాయి. ఈ శిథిలాల ప్రవాహం నదిలోకి చేరడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదకు దారితీసినట్లు నిపుణులు భావిస్తున్నారు.
కాగా నేపాల్‌లో జలప్రళయం వెనుక సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టిబెట్‌లో మంచు చరియలు విరిగి వరద సంభవించిన విషయాన్ని చైనాకు తమకు చెప్పలేదని నేపాల్ ఆరోపిస్తోంది.ఇరు దేశాల మధ్య సమాచారమార్పిడికి అధికారిక ఒప్పందం లేకపోవడంతో అప్రమత్తం చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. టిబెట్‌లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా నేపాల్‌కు చేరలేదా? లేక అక్కడి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లోని నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అయితే నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. ముందస్తు సమాచారం ఇవ్వలేదనే వార్తలను "ఫేక్ న్యూస్" గా కొట్టిపారేసింది.
మరోవైపు చైనా విషయంలో భారత్‌కు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న భారీ డ్యామ్‌తో ఈశాన్య రాష్ట్రాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాతో మన దేశానికి ఎలాంటి నదీజల వివాద పరిష్కార ఒప్పందాలు, యంత్రాంగం లేవు. బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, వర్షపాతం, వరదల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి అవగాహనా ఒప్పందం ఉంది. దాన్ని అయిదేళ్లకు ఒకసారి పునరుద్ధరిస్తారు. ఒకవేళ డ్యామ్ నిర్మాణం తర్వాత చైనా దాన్ని పునరుద్ధరించకపోతే.. భారత్‌కు పెను సమస్యగా మారుతుంది. దీనికి తోడు ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులకూ ఆస్కారం ఎక్కువేనని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే.. చైనా దాన్ని భారత్‌కు చేరవేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉంది.