Burning Topic: మానవ తప్పిదాల వల్లే నేపాల్ లాంటి ప్రమాదాలు!
Burning Topic: నేపాల్ వరదల్లో మృతులు 700 దాటగా, 2 వేలకు పైగా గల్లంతయ్యారు. చైనా నుంచి కొత్తగా గ్లేసియర్ సరస్సు ముప్పు పొంచి ఉంది.
Burning Topic: మానవ తప్పిదాల వల్లే నేపాల్ లాంటి ప్రమాదాలు!
Burning Topic: హిమాలయ రాజ్యం నేపాల్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. భీకర ఆకస్మిక వరదలు కుదిపేసి నాలుగు రోజులేనా గల్లంతైన, మృతుల సంఖ్య విషయంలో స్పష్టత లేదు. గల్లంతైన వారి సంఖ్య రెండు వేలకు పైగానే ఉంటుందని తాజా అంచనా.
బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు కొట్టుకొస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 700 దాటింది. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు చెబుతున్నారు.
సహాయక చర్యల్లో నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. చిత్వన్, గోర్ఖా, రసువా, ధాదింగ్, నవల్పూర్, నౌవల్పరాసి, నువాకోట్, తనహు ప్రాంతాల్లో వందలాది శవాలు దొరుకుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టారు. త్రిశూలిలో నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సహాయక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్ తొలుత తిరస్కరించింది.
ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. గల్లంతయిన వారిలో పలు దేశాల ప్రజలు ఉన్నారు. సహాయక చర్యల్లో భాగం అవుతామని దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా చివరకు నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ముఖ్యంగా భారత్ నుంచి భారత్‌కు అత్యవసర సహాయం అందుతోంది. తాజాగా 10 టన్నుల సామగ్రితో మూడో విమానం ఆ దేశంలో ల్యాండ్ అయింది. అలాగే 11 మంది బృందం కూడా వెళ్లింది. వారిలో వైద్యులు, సొరంగాల వద్ద సహాయక చర్యలు నిర్వహించగల సిబ్బంది, ఇతరులు ఉన్నారు.
నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో గ్రామాలు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. రవాణా సౌకర్యం మూసుకుపోవడంతో ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో హెలికాప్టర్లను రంగంలోకి దించారు అధికారులు.
త్రిశూలి, రసువా ప్రాంతాల్లోని వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న191మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో గత నాలుగు రోజులుగా మూసివేసిన ముగ్లింగ్-ఖాట్మండు ప్రధాన రహదారిని తిరిగి తెరిచారు.
దీంతో దారిమధ్యలో నిలిచిపోయిన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రభుత్వం డిజాస్టర్ జోన్లుగా ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే భారీ ఆకస్మిక వరదల నుంచి ఇంకా కోలుకోకమునుపే నేపాల్‌కు మరో హెచ్చరిక వచ్చింది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. నదీ ప్రవాహానికి అడ్డుకట్టతో బారియర్ సరస్సు ఏర్పడింది.
అది ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను హెచ్చరించింది చైనా. ఈ సరస్సు టిబెట్‌లోని చోచెన్ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం కనిపిస్తోంది.
ఈ నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహిస్తోంది. డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో భూగోళం వేడెక్కడం లాంటి వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో మంచు కురిసే ఎత్తైన ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సుమారు 4 వేల మీటర్ల ఎత్తు వరకు వర్షాలు పడటం, హిమనదాలు వేగంగా వెనక్కి తగ్గడం వంటి పరిణామాలు ప్రమాదాలను పెంచుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నేపాల్ విపత్తుకు కచ్చితమైన కారణం ఇదే అన్నట్లుగా ఇంకేం నిర్ధరణ కాలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి కొండచరియలు, మంచు శిలలు విరిగిపడి గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడం హిమాలయ ప్రాంతంపై మరోసారి ఆందోళనల్ని పెంచింది. అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నందున కొన్ని సరస్సులను చేరుకొని అధ్యయనం చేయడం కూడా కష్టమని చెబుతున్నారు
కాగా హిమాలయాల్లో సంభవించే ప్రతి ప్రకృతి విపత్తులను వాతావరణ మార్పులనే కారణంగా చూడొద్దంటున్నారు నిపుణులు. ఈ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు, జనాభా పెరుగుదల, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు వంటి ఎన్నో అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అసలు సమస్య కనుగొనాలని భూభౌగోళిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇక్కడ పెరుగుతున్న జనాభా, మితిమీరిన వ్యాపార కార్యకలాపాల కోసం నిర్మాణలు చేపడుతుండటం వల్ల, నదీ తీర ప్రాంతాలను, కొండ వాలు ప్రాంతాల్ని ఆక్రమించడం వంటివి ఇక్కడ మానవుల ప్రమేయంతో జరుగుతున్నట్లు ప్రస్తావించారు.
హిమాలయ పరిసరాల్లో జనాభా పెరుగుతుండటంతో పాటుగా వాణిజ్య కార్యకలాపాలు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ప్రమాద తీవ్రతకు ఒక కారణమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఇంకా ఆస్తి, ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో వేసవి రుతుపవనాల సమయంలో వాతావరణ ఘటనల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురవడానికి బదులుగా వర్షపాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని వల్ల కొండ వాలుల్లో పేరుకుపోయిన మట్టి, శిథిలాలు బలహీనపడి అస్థిరంగా మారడం వల్ల కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో గ్లేసియర్లు పెరిగిపోవడం. వేగంగా కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
అత్యంత విధ్వంసకరమైన వరదల్లో చాలా వరకు పెద్ద నదుల నుంచి కాకుండా, చిన్న హిమనదుల ప్రవాహాల నుంచి ప్రారంభమవుతున్నాయని గుర్తించారు. ఈ ప్రవాహాలు నీటితో పాటు భారీ మొత్తంలో బండరాళ్లు, మట్టి, ఇతర శిథిలాలను దిగువ ప్రాంతాలకు తీసుకొస్తాయి. ఇరుకైన లోయల్లో ఇవి భారీ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.