Off The Record: శ్రీనివాస్ బాబు కు వైసీపీ బంపర్ ఆఫర్? చంద్రబాబు కు బిగ్ షాక్?
Off The Record: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, శ్రీనివాస బాబు మధ్య జరుగుతున్న గొడవ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
Off The Record: శ్రీనివాస్ బాబు కు వైసీపీ బంపర్ ఆఫర్? చంద్రబాబు కు బిగ్ షాక్?
Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని టిడిపిలో నెలకొన్న వివాదం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో నరసాపురం, ఏలూరు పార్లమెంట్ స్థానాల సమీకరణాల మూలంగా దెందులూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటన ఆలస్యమైంది. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధిగా ఉన్న శ్రీనివాస బాబు స్వయంగా దెందులూరు టికెట్ కోసం ప్రయత్నించడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. చివరకు చింతమనేని టికెట్ సాధించి విజయం సాధించినప్పటికీ, అంతర్గత విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల శ్రీనివాస బాబు వైసీపీ నాయకులకు న్యాయవాదిగా బెయిల్ ఇప్పించడం, చింతమనేనిపై అవినీతి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలు పరస్పరం కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. శ్రీనివాసబాబు ఇంటిపై చింతమనేని అనుచరుల దాడి, తదనంతర పరిణామాల్లో శ్రీనివాస బాబు అరెస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ వంటి చర్యలు వేగంగా జరిగిపోయాయి.
అయితే దెందులూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వివాదాన్ని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోందన్న టాక్ లేకపోలేదు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీనివాసుబాబు మధ్య నెలకొన్న వివాదాన్ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచన చేస్తోందట వైసీపీ. ఈ టాక్ రాజకీయ పరిశీలకుల్లో రీసౌండ్ చేస్తోంది. దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలబడగల లీగల్ బ్యాక్‌గ్రౌండ్, దూకుడు స్వభావం ఉన్న నాయకుడి కోసం వెతుకుతున్న వైసీపీకి.. శ్రీనివాస బాబు రూపంలో ఒక అవకాశం లభించింది. చింతమనేనికి ప్రత్యర్థిగా నిలబడే సత్తా శ్రీనివాస బాబుకు ఉండడంతో
భవిష్యత్తులో ఆయనకే మద్దతు ఇస్తే దెందులూరులో వైసీపీ జెండా ఎగురవేయవచ్చుననే ఆలోచన చేస్తుందట జగన్ నాయకత్వం.
మరోవైపు అధికార టీడీపీకి దేందులూరులో నెలకొన్న వివాదం తలనొప్పిని తెచ్చిపెడుతోంది. కూటమి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇటువంటి వివాదాలే మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవ్వడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందన్న ప్రచారం ఉండనే ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు ఇవ్వడానికి శ్రీనివాస బాబుపై తక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ, చింతమనేని ప్రభాకర్ వంటి కీలక నేతల దూకుడు స్వభావం పార్టీకి సవాలుగా నిలుస్తోందట.
దెందులూరు నియోజకవర్గంలో తాజా పరిణామాలు సరికొత్త రాజకీయ సమీకరణాలు దరితీస్తాయని వాదనలు వినిపిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్‌ను ఢీకొట్టేందుకు ప్రతిపక్షం శ్రీనివాస బాబును లేదా ఆయన కుటుంబ సభ్యులను ముందుంచే వ్యూహాన్ని రచిస్తోందట. అయితే, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు ఉన్న గట్టి కేడర్ బేస్, సామాజికవర్గ మద్దతును అధిగమించడం ప్రతిపక్షానికి అంత సులువు కాదన్న వాదన ఉంది. ఈ వివాదాల వల్ల ఇరుపక్షాల ఉమ్మడి మిత్రులు, బంధువులలో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ అది ఓట్ల శాతాన్ని ఎంతవరకు మారుస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.