Burning Topic: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్?

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ వ్యవహారంలో సొంత దేశంలోనే ఎదురుదెబ్బ! ప్రతినిధుల సభ ఆమోదించిన 'వార్ పవర్స్' తీర్మానం ఏంటి?

Update: 2026-06-05 01:26 GMT

Burning Topic: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్?

Burning Topic: పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగలింది. ఇరాన్‌లో సైనిక చర్యకు సంబంధించి అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించరాదని స్పష్టం చేస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన 'వార్ పవర్స్' తీర్మానాన్ని సభ ఆమోదించింది. ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం విపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం సంచలనం సృష్టించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో 215 మంది సభ్యులు అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానం ట్రంప్‌ విదేశాంగ, సైనిక విధానాలపై కాంగ్రెస్‌ అసంతృప్తికి నిదర్శనంగా చెబుతున్నారు.

న్యూయార్క్‌కు చెందిన డెమొక్రాట్ సభ్యుడు గ్రెగరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ప్రకారం.. అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదంటే కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. రాజ్యాంగబద్ధ బాధ్యతలను కాంగ్రెస్ నిర్వర్తిస్తోందని, కార్యనిర్వాహక వ్యవస్థపై నియంత్రణ, సమతుల్యతను కొనసాగించడం తమ బాధ్యత అని గ్రెగరీ మీక్స్ తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే ఇరాన్ మీద సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం వల్ల అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారుతోంది. అనవసర, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

అమెరికా ప్రతినిధుల సభ ‘వార్‌ పవర్స్‌ రిజల్యూషన్‌’ను ఆమోదించడం వైట్‌హౌస్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. స్వల్ప తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ఇప్పుడు ఈ తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. అక్కడ దీనికి ఆమోదం లభిస్తే.. ఆ తర్వాత అది అధ్యక్షుడు ట్రంప్‌ వద్దకు చేరుతుంది. ఈ తీర్మానం చట్టబద్ధంగా అమలులోకి రావాలంటే కాంగ్రెస్ రెండు సభల ఆమోదం అవసరం. అయితే ఆయన ఈ తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది. అయితే ట్రంప్‌ దూకుడును కొంత మేరైనా నియంత్రిస్తుందంటున్నారు. కాగా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం అధ్యక్షుడికి ఉన్న చర్చల స్వేచ్ఛను పరిమితం చేయడం ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇరాన్ అంశంలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, ఈ తరుణంలో యుద్ధాధికారాలను తగ్గించడం అమెరికా చర్చల సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఇరాన్‌ జరిపే దాడుల్లో అమెరికా సైనికులు చనిపోనంతవరకు.. యుద్ధం తిరిగి ప్రారంభించకూడదని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలు, వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ.. కాల్పుల విరమణ అమల్లోనే ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒప్పంద చర్చల్లో తమ డిమాండ్లు ఆమోదించేవరకు చిన్నపాటి ఘర్షణలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. కాల్పుల విరమణపై ఓవల్‌ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ అనే పదానికి ఇరాన్‌లో భిన్నమైన అర్థం ఉందని ట్రంప్‌ అన్నారు. టెహ్రాన్‌ దృష్టిలో తాత్కాలిక సంధి అంటే పరిమితంగా కాల్పులు జరపడమేనని వారు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే, వారు అలా అనుకోవడం కూడా మంచి విషయమేనని వ్యాఖ్యానించారు. కాగా ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు ఈ వారాంతానికి కొలిక్కిరావచ్చంటున్నారు డొనాల్డ్ ట్రంప్.

ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్‌ సైన్యం కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలే లక్ష్యంగా తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలో కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటల్లింది. కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ దాడులతో కువైట్ శవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. ఇరాన్‌ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. కాగా కువైట్అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాము లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్‌ పేర్కొంది. ఎయిర్‌పోర్టుపై దాడికి అమెరికా తయారుచేసిన పేట్రియాట్‌ క్షిపణే కారణమని ఆరోపించింది.అయితే ఈ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది.


Full View

Tags:    

Similar News