BurningTopic: మోడీ దెబ్బకు షేక్ అవుతున్న దేశ రాజకీయాలు
BurningTopic: దేశ రాజకీయాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు మరియు ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న వరుస చీలికలపై విశ్లేషణ.
BurningTopic: మోడీ దెబ్బకు షేక్ అవుతున్న దేశ రాజకీయాలు
BurningTopic: ఆపరేషన్ కమల్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలను వణికిస్తున్న పదం.. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన లుకలుకలు క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఈ తిరుగుబాట్ల కారణంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా, బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. మెజారిటీ మార్కు 272 కంటే ఎక్కువ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 293 సీట్ల బలం ఉంది. అయితే లోక్ సభలో రెండొంతుల సంఖ్యాబలం లేకపోవడంతో ఇటీవల 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు బిల్లులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి లోక్‌సభలో ఎదురైన మొట్టమొదటి ఎదురుదెబ్బ ఇది.
రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం అంతంత మాత్రమే. తాజాగా జరిగిన ఎన్నికలు, టీఎంసీలో చీలక ప్రభావంతో 163 స్థానాలకు చేరింది. అయితే కనీస మెజారిటీ అయిన 172 సీట్లకు దూరంలోనే ఉంది. పార్లమెంటులో కీలక బిల్లులు నెగ్గాలన్నా, ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా తగిన సంఖ్యాబలం అవసరం. ఈ నేపథ్యంలోనే బీజేపీ పకడ్బందీ వ్యూహం పన్నిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రత్యర్థి పార్టీల్లో ముఖ్యంగా ప్రాంతీయ పక్షాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. బీజేపీ ఎత్తుల ముందు చిత్తు అవుతున్నాయి. బెంగాల్‌లో ఓటమి తర్వాత టీఎంసీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 15 ఏళ్లు పరిపాలించిన ఆ పార్టీలో మొదలైన చీలికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాకుతున్నాయి. బీజేపీ దూకుడుతో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని చిన్నా, చితక పార్టీలే కాకుండా ఏళ్లపాటు పాలించి, గట్టి పట్టున్న పార్టీలు కూడా ఇప్పుడు తిరుగుబాట్లతో సతమతం అవుతున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటికే శివసేన, ఎన్సీపీ పార్టీల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు చీలిపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా శివసేన ఉద్ధవ్ పార్టీలో పెద్ద తిరుగుబాటే జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన 9 మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ధిక్కార స్వరం వినపించారు. వీరంతా ఇప్పటికే స్పీకర్‌ను కలిసి ఒక లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో తమను కలిపేస్తూ, లోక్‌సభలో తమకు సీట్లు విడిగా కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి కేవలం ముగ్గురు ఎంపీలే వచ్చారు. మెజారిటీ ఎంపీల గైర్హాజరుపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీచేస్తాం. ఈ నమ్మకద్రోహులను వదిలిపెట్టేదే లేదు. స్వస్థలాలు, సొంత నియోజకవర్గాల్లో వాళ్లను స్వేచ్ఛగా తిరిగనివ్వం. వాళ్లకు సరైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు.
మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోనూ అలజడి మొదలైంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాన విపక్షం సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుంది. ఎస్పీకి చెందిన 37 మంది ఎంపీల్లో సుమారు 25 మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో భారీ చీలిక వచ్చే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి సంసిద్దంగా ఉన్నామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణమాలు పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలవరపెట్టాయి. ఇవన్నీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ఆడుతున్న చౌకబారు నాటకాలని కొట్టి పారేశారు. తమ పార్టీ ఎంతో పటిష్టంగా ఉం దని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తృణమూల్, శివసేన యూబీటీ, సమాజ్ వాది పార్టీలలో అలజడి మిగతా ప్రాంతీయ పార్టీలను హడలె త్తిస్తోంది. తదుపరి వంతు ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 మంది రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో చేరారు. జార్ఖండ్ లోని అధికార జేఎంఎం సైతం ఎన్టీఏ కూటమిలోకి వస్తుం దన్న ప్రచారం సాగుతోంది.తాజాగా అక్కడ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒకటి జేఎంఎం గెలుచుకోగా, మరో సీటును బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇండీ కూటమిలోని ఆర్‌జేడీ, లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో తాము ఓడిపోవాల్సి వచ్చిదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకప్పుడు దేశంలో మూడో జాతీయ పార్టీగా వెలుగొందిన బీఎస్సీ ఇప్ప టికే కనుమరుగు దశలో ఉంది.మరోవైపు ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఏ నేత ఎప్పుడు తమపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తారోననే బెంగ పట్టుకుంది.
తాజా పరిణామాల్లో విపక్షాల కూటమి బలహీనపడటం అధికార బీజేపీకి కలిసొస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ గెలుపొందాకా ఇండీ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్లేటు ఫిరాయించింది. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి కావడంతో డీఎంకే ఆ పార్టీతో బంధం తెంచుకుంది. స్టాలిన్ ఇండీ కూటమి నుంచి బయటకు రావడం, టీఎంసీలో మెజారిటీ ఎంపీలు చీలిపోవడం, తాజాగా శివసేన ఉద్దవ్ పార్టీలో తిరుగుబాటు, సమాజ్ వాదీలో లుకలుకలు, ఆప్ చీలిక పరోక్షంగా ఎన్డీఏకు ఉపయోగపడుతోంది. ఈ పరిణామాలతో పార్లమెంట్ ఉభయ సభల్లో కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు సంఖ్యాబలం కలిసొస్తుంని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు బీజేపీ 'ఆపరేషన్ కమల్' వ్యూహాన్ని అమలు చేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రమైంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.
మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టడం ఎంత సహజమో, చీలిపోవడం కూడా అంతే సహజం. అయితే పార్టీ చీలిపోయినప్పుడు ప్రజల్లో కలిగే సందేహం అసలు పార్టీ ఎవరిది? పార్టీ గుర్తు ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంటుంది. ఈ క్రమంలో ఈసీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ జాతీ య కార్యవర్గం, జనరల్ కౌన్సిల్, వివిధ స్థాయిల ప్రతినిధులలో ఎవరికి ఎక్కువ ఆధిక్యం ఉందో లెక్కిస్తారు. పార్టీ అంతర్గత ఎన్నికల విధానం, నిర్ణయాధికారాల నియమాలను పరిశీలించి ఎన్నికల సంఘం టెస్ట్ ఆఫ్ మెజారిటీ నిర్వహించి అసలైన పార్టీని నిర్ణయిస్తుంది. ఈ క్రమంలో రెండిట మూడో వంతుతో చీలిక వస్తే ఆ పార్టీ ఉనికి కోల్పోయి తిరుగుబాటు వర్గమై అసలైన పార్టీగా ఎన్నికల గుర్తు దక్కివచుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శివసేన, ఎన్సీపీలకు ఎదురైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల చిహ్నాన్ని కోల్పోయింది.