Off The Record: వైఎస్ షర్మిలకు షాక్?
Off The Record: రాయలసీమకు చెందిన కీలక నేతలు వైఎస్ షర్మిల, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లకు రాజ్యసభ సీట్లు దక్కలేదు.
Off The Record: వైఎస్ షర్మిలకు షాక్?
Off The Record: సీమ నేతలకు..పెద్దల సభకు దారి దొరకలేదు. రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశించిన సీమ వాసులకు ఆయా పార్టీలు చివరికి మొండిచెయ్యే చూపాయి. వారసత్వ రాజకీయాలతో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన నేతలు పదవి కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందట. అధికార, ప్రతిపక్షాల్లో పదవులు ఆశించిన కీలక నేతలకు నిరాశే ఎదురైందట. చివరి నిమిషం వరకూ సీటు ఖరారని ఒకరిద్దరు పేర్లు బలంగా వినిపించినా అధిష్టానం నిర్ణయాలతో వారి అడ్రస్ గల్లంతైందట.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మిల కొనసాగుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ నుంచి ఆమె కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2021 జూలై 8న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె సిద్ధమయ్యారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. 2024, జనవరి4 ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
తెలంగాణ రాజకీయాలకు స్వస్తి చెప్పి, అదే ఏడాది జనవరి 16న ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని విలీనం చేసే సమయంలో ఆమెకు అధిష్టానం రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రాజ్యసభ నామినేషన్లకు ముందు ఆమె తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు.
తనకు కర్ణాటక కోటాలో రాజ్యసభ సీటు కేటాయించాలని కోరారు. అధిష్టానం శర్మిల విజ్జప్తిని పరిగణలోకి తీసుకుందని... ఆమెకు రాజ్యసభ సీటు దాదాపు ఖాయం అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి ఏమైందోకాని కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, మన్సూర్ ఆలీఖన్ పేర్లను రాజ్యసభకు ఎంపిక చేశారు. పదవిపై ఎంతో ఆశలు పెట్టుకున్న శర్మిలకు, ఆమె మద్దతుదారుకు నిరాశే ఎదురైంది.
ఇక టీడీపీ నుంచి కడపకు చెందిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి రాజ్యసభ సీటును ఆశించారు. శ్రీనివాసరెడ్డి ముందు నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా... అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కో-ఆర్టినేటర్‌గా కొనసాగుతున్నారు. ఈసారి తనకు సీటు కావాలని అధిష్టానంపై తనదైన శైలిలో ఒత్తిడి తెచ్చారట. కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్‌కు పదవి దక్కింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ను పదవులు వరించాయి. రాజ్యసభ సీటు కోసం అధిష్టానం నిర్వహించిన సర్వేలో శ్రీనివాస రెడ్డికి అంత అనుకూలంగా నివేదికలు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరో సీమ నేత, సీడబ్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత రఘువీరా రెడ్డి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఆశించినా ఫైనల్‌గా భంగపాటు తప్పలేదు. ముందు నుంచి ఆయనకు కర్ణాటక కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మడకశిరకు ఆనుకొని ఉన్న టుముకూరు జిల్లాతో పాటు బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు గత ఎన్నికల్లో ఆయన కృషి చేశారన్న ప్రచారం ఉంది. మల్లికార్జున ఖర్చే సహా పలువురు కర్ణాకట నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయట. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లి తన ప్రయత్నాలు సాగించినా.. ఫలించలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో నిలిచి ఓడిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఆశించారట. పార్టీలోనూ ఆయన పేరు ముందు నుంచే ప్రస్థావనకు వచ్చిందన్న ప్రచారం జరిగింది. మాజీ సీఎంకు రాజ్యసభ సీటు ఈ సారి గ్యారెంటీ అని ఆయన వర్గం భావించిందట. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటులో భాగంగా ఈ సారి బీజేపీకి అవకాశం దక్కలేదు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేనకు కేటాయించారు. ఫలితంగా నల్లారి వారి ఆశలు అడియాశలు అయ్యాయట. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం ఆయనకు రాజకీయంగా కాలం కలిసి రావడం లేదట. గత ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ఆయన అంతకు ముందు కొత్త పార్టీ పెట్టి విఫలం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరినా అంతగా గుర్తింపు లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
సీమ నుంచి సీటు ఆశించిన వారు రాజకీయాల్లో తలలు పండినవారే అయినా.. కొంత కాలంగా సదరు నేతలకు కాలం కలిసి రావడం లేదట. నామినేటెడ్
పదవుల విషయంలో వీరి ప్రయత్నాలు ఫలించడం లేదట. చూడాలి భవిష్యత్తులో అయినా ఇలాంటి సీనియర్లకు ఆయా పార్టీలు తగిన గుర్తింపు ఇస్తాయో...
పార్టీలో.. పదవుల్లో మున్ముందు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో..?