Off The Record: ఆ ముగ్గురు మంత్రులు అవుట్?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ మార్పులు రాబోతున్నాయా? డిప్యూటీ సీఎం నుంచి కీలక మంత్రుల వరకు పదవులకు ఎసరు వచ్చిందా?
Off The Record: ఆ ముగ్గురు మంత్రులు అవుట్?
Off The Record: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న మంత్రులు ముఖ్యంగా డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రుల స్థానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాకు పెద్దపీట వేయాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భట్టి విక్రమార్కను స్పీకర్ పదవికి పంపే ప్రతిపాదన కూడా చర్చల్లో ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కని సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలనే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని కలిసిన ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఒక మంత్రికి స్థానచలనం కల్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అదే జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్ సైతం అవకాశం దక్కేచాన్స్ ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిపైనా మార్పులు ఉండొచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మార్పులు జరిగితే ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేతల భవిష్యత్ రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం ముగ్గురు మంత్రులు అవుట్ అవుతారా..? కొత్త ముఖాలకు ఛాన్స్ దక్కుతుందా..? తెలంగాణ కాంగ్రెస్‌లో నిజంగానే భారీ మార్పులు రానున్నాయా..? లేక ఇవన్నీ రాజకీయ ప్రచారానికే పరిమితమవుతాయా..? సమాధానం కోసం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ రేవంత్ టీమ్‌లో ఎవరెవరు కొనసాగుతారు.. ఎవరెవరు కొత్తగా చేరుతారు..? అన్నది చూడాలి మరి.