Tirupati: ప్రజాస్వామ్య స్ఫూర్తికి మానవత్వపు తోడు: తిరుపతి పోలీసుల సేవ!
Tirupati: తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం ఎగువపూడి గ్రామంలో మంచానికే పరిమితమైన వృద్ధురాలిని నులక మంచంతో సహా పోలింగ్ కేంద్రానికి మోసుకెళ్లి పోలీసులు ఓటు హక్కు కల్పించారు.
Tirupati: ప్రజాస్వామ్య స్ఫూర్తికి మానవత్వపు తోడు: తిరుపతి పోలీసుల సేవ!
తిరుపతి: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మార్గదర్శకత్వంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన సందర్భాల్లో అండగా నిలుస్తూ మానవీయ సేవలను అందిస్తోంది. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో చొరవ చూపుతున్నారు.
ఇందులో భాగంగా, నేడు జిల్లాలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కేవీవీబి పురం మండలం ఎగువపూడి గ్రామంలో పోలీసుల మానవీయ స్పందనకు నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఒక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన విధుల్లో ఉన్న పోలీసు అధికారి వెంటనే స్పందించి, స్థానిక యువకుల సహకారంతో వృద్ధురాలిని ఆమె పడుకున్న నులక మంచంతో సహా భుజాలపై మోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు.
ఓటు వేయాలనే ఆమె సంకల్పానికి పోలీసుల సేవాభావం తోడవడంతో ప్రజాస్వామ్య హక్కు సాకారమైంది. విధి నిర్వహణ అంటే కేవలం శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవడం కూడా అని ఈ ఘటన చాటిచెప్పింది.
ఒక వృద్ధురాలి ప్రజాస్వామ్య ఆకాంక్షను నెరవేర్చేందుకు చొరవ చూపిన పోలీసు సిబ్బందిని, వారికి సహకరించిన ఎగువపూడి గ్రామ యువకులను పలువురు అభినందిస్తున్నారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి పౌరుడి ఓటు హక్కును గౌరవించడం ప్రజాస్వామ్యానికి బలమని ఈ మానవీయ ఘటన మరోసారి చాటి చెప్పింది.