Renigunta: రేణిగుంటలో ముగిసిన కూటమి సర్పంచ్ అభ్యర్థి చిత్ర ప్రచారం

రేణిగుంట: రేణిగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారం ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ప్రజల నుంచి విశేష స్పందన, ఆదరణ లభించిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె. చిత్రకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని, ఇంటింటి ప్రచారంలో మహిళలు, యువత, ప్రజలు చూపిన అభిమానం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల సహకారం, కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఎన్నికల ప్రచారం అంగరంగ వైభవంగా జరిగిందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారానికి సహకరించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువతతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కూటమి అభ్యర్థి కె. చిత్ర విజయం ఖాయమని, భారీ మెజారిటీతో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం సర్పంచ్ అభ్యర్థి కె. చిత్ర మాట్లాడుతూ.. రేణిగుంట పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తే రేణిగుంట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి చిత్రకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులు మిథున్ శాలి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్, మురళి, నాగేశ్వరరావు, కన్నారెడ్డి, బుల్లెట్ రాజు, నాని, కొరియర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: