Renigunta: విషాదం.. పెళ్లి అప్పుల బాధ తాళలేక 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో తీవ్ర అప్పుల బాధతో కె. చిరంజీవి (24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Renigunta: విషాదం.. పెళ్లి అప్పుల బాధ తాళలేక 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య!
రేణిగుంట: అప్పుల బాధ తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. తవణంపల్లి మండలం ముత్తరపల్లి గ్రామానికి చెందిన కె. చిరంజీవి (24) రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని ఇటుకల తయారీ కేంద్రంలో కూలి పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.
వివాహ సమయంలో చేసిన సుమారు రూ.4 లక్షల అప్పులను తీర్చేందుకు కూలి పనులు చేస్తుండగా, అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చిరంజీవి తాను నివాసం ఉంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.
మృతుడి భార్య ఎం. నాగవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.