Indiramma Kutumba Jeevan Bima

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాల్లో బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, నామినీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులు నింపాల్సిన అవసరం లేకుండా, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా గుర్తించనున్నారు. అయితే ఇప్పటికే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న జీవిత బీమా పథకాల పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే ఈ కొత్త పథకంలో చేర్చుతారు. పాత బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వయసు, ఆధార్ నిబంధనలు ఇవే

ఈ పథకం కింద ప్రతి రేషన్ కార్డు కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే బీమా కల్పిస్తారు. ముఖ్యంగా కుటుంబ పెద్ద లేదా ఇంటిని పోషించే ప్రధాన వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. వయసు లెక్కింపునకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆధార్‌లో పుట్టిన తేదీ లేకుండా కేవలం సంవత్సరం మాత్రమే ఉంటే జులై 1వ తేదీని జన్మదినంగా పరిగణిస్తారు. పుట్టిన తేదీలో ఏమైనా తప్పులు ఉంటే ముందుగా ఆధార్‌లో సరిచేసుకున్న తర్వాతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బీమా కవరేజీ మొదలైన తర్వాత ఆ పాలసీ సంవత్సరంలో వ్యక్తి వయసు 59 ఏళ్లు దాటినా, ఆ ఏడాది ముగిసే వరకు బీమా రక్షణ కొనసాగుతుంది.

ఈ-కేవైసీ తప్పనిసరి.. దివ్యాంగులకు ఇంటి వద్దే నమోదు

బీమా పథకంలో చేరాలంటే రేషన్ కార్డుకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. తద్వారా అనర్హులు, తప్పులు లేకుండా అసలైన లబ్ధిదారులను గుర్తించవచ్చని భావిస్తోంది. నమోదు ప్రక్రియ కోసం లబ్ధిదారులు ఆధార్ కార్డు, ఆహార భద్రత (రేషన్) కార్డు ప్రతులతో పాటు మొబైల్ నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ధ్రువీకరణతో నమోదు చేస్తారు. దరఖాస్తుదారులు స్వయంగా నమోదు శిబిరాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలి. కానీ అనారోగ్యం లేదా దివ్యాంగత్వం వల్ల శిబిరానికి రాలేని వారి కోసం శిబిరం ఇన్‌ఛార్జి స్వయంగా వారి ఇంటికి వెళ్లి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

నామినీ నిబంధనల్లో స్పష్టత

నమోదు సమయంలో రేషన్ కార్డు వివరాలను పౌరసరఫరాల శాఖ డేటాతో సరిపోల్చి కుటుంబ సభ్యుల సమాచారాన్ని నిర్ధారిస్తారు. ఆ తర్వాత బీమా పొందే వ్యక్తి తన నామినీల వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను పెట్టుకుంటే, రూ.5 లక్షల బీమా మొత్తాన్ని ఎవరికి ఎంత శాతం పంచాలో ముందే స్పష్టంగా చెప్పాలి. నామినీ గనుక మైనర్ అయితే, క్లెయిమ్ డబ్బులు తీసుకోవడానికి ఒక మేజర్ వ్యక్తిని లేదా సంరక్షకుడిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నామినీని మార్చుకోవాలనుకున్నా లేదా బీమా వ్యక్తి కంటే ముందే నామినీ మరణించినా నిబంధనల ప్రకారం మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా అమలు

ఈ పథకం నమోదు, లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ మొత్తం సదరు కుటుంబం ఉన్న స్వస్థల జిల్లాలోనే నిర్వహిస్తారు. పథకం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ప్రతి జిల్లాలో అదనపు కలెక్టర్ లేదా సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నారు. అలాగే మండలాలు, మున్సిపాలిటీలకు జిల్లా స్థాయి అధికారులను, గ్రామ పంచాయతీలు, వార్డుల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో లేదా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను సమన్వయకర్తలుగా నియమించి శిబిరాలను పర్యవేక్షించనున్నారు.

Tags: