Telangana Farmers:  తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్

Telangana Farmers : ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని, డ్రిప్‌పై 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

Update: 2026-07-31 03:53 GMT

Telangana Farmers

Telangana Farmers:  రాష్ట్రంలోని రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం బిగ్ న్యూస్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్‌నీనో ప్రభావం వల్ల ఈసారి తెలంగాణలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో.. నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండించే రైతులకు ఏకంగా 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించనున్నట్లు వెల్లడించింది.

ఎల్‌నీనో ప్రభావంపై నిపుణుల నివేదిక

గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి ప్రత్యేంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌నీనో పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగుపై నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు. గతేడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 79.49 లక్షల ఎకరాలు సాగవ్వగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 74.56 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారని అధికారులు వివరించారు. ప్రస్తుతం పత్తి 45 లక్షల ఎకరాల్లో, వరి 14.92 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోందని తెలిపారు.

90 శాతం సబ్సిడీతో డ్రిప్

వర్షాలు తక్కువగా ఉన్నందున ప్రతి చుక్క నీటినీ సమర్థవంతంగా వాడుకునేందుకు వీలుగా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రైతులకు 75 నుంచి 90 శాతం వరకు సబ్సిడీతో డ్రిప్ సాగు పరికరాలు అందించాలని కమిటీ సూచించింది. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే సీఎం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కోసం సెంట్రలైజ్డ్ కిచెన్లను నిర్మిస్తున్నామని, వాటి పరిసరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల సాగును పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులు పండించిన కూరగాయలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు నిరంతర విద్యుత్ సౌకర్యం

పాడి రైతులకు ఊరటనిస్తూ పశుగ్రాస విత్తనాలపై కూడా భారీగా సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా డైరీ యూనిట్లు స్థాపించేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సాగునీటి పంపింగ్ కోసం నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా నిరంతరం రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని, గ్రామీణ స్థాయిలో ప్రత్యే బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News