Harish Rao: నాడు అడ్డం పడుకున్నావు.. నేడు రిబ్బన్ కట్ చేస్తున్నావు!!

Harish Rao: బీఆర్ఎస్ హయాంలో పూర్తైన పనులకే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.

Update: 2026-03-21 06:59 GMT

Harish Rao: నాడు అడ్డం పడుకున్నావు.. నేడు రిబ్బన్ కట్ చేస్తున్నావు!!

సిద్దిపేట: బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

కాళేశ్వరం నీళ్లే దిక్కు:

"సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి వెళ్లేది కాళేశ్వరం నీళ్లే కదా? మరి నాడు కాళేశ్వరం ప్రాజెక్టును 'కూలేశ్వరం' అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?" అని హరీష్ రావు ప్రశ్నించారు. రేపు సిద్దిపేట పర్యటనకు వచ్చేటప్పుడు కాళేశ్వరం జలాలను తలపై చల్లుకోవాలని, అప్పుడైనా చేసిన పాపం తగ్గుతుందని ఎద్దేవా చేశారు.

మా ముందుచూపు - మీ ప్రచారం:

ఎంతో ముందుచూపుతో బీఆర్ఎస్ హయాంలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని హరీష్ రావు గుర్తు చేశారు. నాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు అడ్డం పడుకున్నారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే ప్రాజెక్టు ఫలాలను అనుభవిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.

చిల్లర మాటలు మానుకోవాలి:

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా చిల్లర మల్లర మాటలు మానుకోవాలని హరీష్ రావు సూచించారు. తాము పడ్డ శ్రమకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకాలు వేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News