Kakinada AE Family Case: లవ్ జిహాద్ వేధింపులు.. ఏఈ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సాధిక్‌ అరెస్ట్‌

Kakinada AE Family Case: ఐదు రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్‌ను ప్రత్యేక బృందాలు శుక్రవారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నాయి.

Update: 2026-08-22 02:02 GMT

Kakinada AE Family Case

Kakinada AE Family Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్యల కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఐదు రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్‌ను ప్రత్యేక బృందాలు శుక్రవారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నాయి. కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కుటుంబం చావుకు కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించారు. 10 మంది ఎస్సైలు, 40 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో ఢిల్లీలో నిర్వహించిన తనిఖీల్లో సాధిక్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నాటికి అతడిని కాకినాడకు తీసుకువచ్చి విచారించనున్నారు.

బ్లాక్ మెయిలింగ్.. ఇస్లాంలోకి మారాలంటూ ఒత్తిడి

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యతో సాధిక్ ఖాన్ తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ప్రైవేటు ఫోటోలను ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు సౌజన్య రాసిన లేఖ ఆధారంగా వెల్లడైంది. ఈ మనస్తాపం, మానసిక వేధింపులు తట్టుకోలేకే కుటుంబమంతా అర్ధరాత్రి వేళ గోదావరి నదిలో దూకి దారుణానికి ఒడిగట్టింది.

అల్లుడి అనుమానాస్పద మృతిపై విచారణ

నూకరాజు వాట్సప్‌లో పోస్ట్ చేసిన సుదీర్ఘ లేఖతో పాటు, సౌజన్య పేరుతో లభించిన మరో లేఖ ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. తన భర్తకు విషం ఇచ్చి సాధిక్ ఖాన్ చంపేశాడంటూ సౌజన్య ఆ లేఖలో ఆరోపించడం కలకలం రేపుతోంది. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతికి సాధిక్ ఖాన్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో రాజమహేంద్రవరం రెండో పట్టణ, సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అల్లుడి మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు ఆ కోణంలోనూ ఆధారాలు సేకరిస్తున్నారు.

విచారణలో వెలుగులోకి రానున్న నిజాలు

ఈ దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు, బాధిత కుటుంబ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సాధిక్ ఖాన్‌ను కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టి అతడి క్రూరత్వానికి సంబంధించిన అన్ని విషయాలను బయటపెడతామని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags:    

Similar News