తెల్లారేసరికి గుడికి వచ్చిన పూజారి.. గర్భగుడి ముందు ఊహించని దృశ్యం చూడగా

Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని వైష్ణవి నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా అపార్ట్‌మెంట్‌లలో దొంగతనాలకు పాల్పడటమే కాకుండా, గణపతి ఆలయం హుండీని ఎత్తుకెళ్లిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2026-05-25 08:26 GMT

తెల్లారేసరికి గుడికి వచ్చిన పూజారి.. గర్భగుడి ముందు ఊహించని దృశ్యం చూడగా

Hyderabad: రోజూలానే తెల్లారేసరికి మడిబట్టలతో ఆలయానికి వచ్చాడు పూజారి. దేవుడి విగ్రహం శుభ్రంగా తుడిచి.. హారతికి, ఉదయం పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్దం చేసుకుంటున్నాడు. ఈలోగా గర్భగుడి బయట ఏదో అలికిడి వినిపించిందని చూడగా.. అక్కడ ఊహించని దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్‌లోని వైష్ణవి నగర్ కాలనీలో గత మూడు రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు ఏకంగా ముఠాలుగా ఏర్పడి, వరుసగా రెండు రోజుల పాటు స్థానిక అపార్ట్‌మెంట్‌లలో చొరబడి చేతికి చిక్కినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటనలతో కాలనీవాసులు ఇంకా కోలుకోకముందే, ఆదివారం రాత్రి దొంగలు మరో ఘోరానికి ఒడిగట్టారు. కాలనీలో ఉన్న గణపతి ఆలయంలోకి చొరబడి, ఏకంగా స్వామివారి హుండీనే పెకలించుకుని ఎత్తుకెళ్లారు.

ఆలయ ప్రాంగణం నుంచి హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, దానిని సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పగలగొట్టి, అందులో భక్తులు సమర్పించిన కానుకలు, నగదును తీసుకుని పరారయ్యారు. ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ హుండీలో దాదాపు రూ. 25 వేల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, అర్చకులు హుండీ కనిపించకపోవడం చూసి నిర్ఘాంతపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

వరుస మూడు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అసలు ఏరియాలో పోలీసులు ఉన్నారో లేదో అర్థం కావడం లేదు. గతంలో రాత్రి వేళల్లో రెగ్యులర్‌గా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు తిరిగేవి, కానీ ఇప్పుడు అసలు పెట్రోలింగ్ అనే మాటనే లేదు" అని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుని, రాత్రి వేళల్లో భద్రతను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News