Heavy Rains Alert: డేంజర్ బెల్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rains Alert: కేవలం వర్షాలే కాకుండా, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2026-06-28 02:55 GMT

Heavy Rains Alert

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో గత రెండు రోజులుగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. జూన్ 28న తెలంగాణలోని 14 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం వర్షాలే కాకుండా, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత శనివారం మహబూబాబాద్‌లోని మరిపెడలో ఏకంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.

పిడుగుల పట్ల జాగ్రత్త అవసరం

కేవలం వర్షాలే కాకుండా, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, సురక్షితమైన ఇళ్లలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు లేదా పాతబడిన గోడల పక్కన ఉండవద్దని కోరారు.

హైదరాబాద్ వాతావరణం

రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగలు, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం 65 శాతం వరకు ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్ట ఉష్ణోగ్రత 24°Cగా ఉండే అవకాశం ఉంది. నగరవాసులు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమలో రాబోయే రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Tags:    

Similar News