Gas Cylinder Crisis: బుక్ చేస్తే మూడు వారాల దాకా నో గ్యారంటీ.. రాష్ట్రంలో 15 లక్షల సిలిండర్లు పెండింగ్

Gas Cylinder Crisis: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో భారీ జాప్యం జరుగుతోంది. సాఫ్ట్‌వేర్ లోపాలు, కొత్త నిబంధనల వల్ల 15 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

CR Reddy
Published on: 3 April 2026 7:30 AM IST
Gas Cylinder
X

Gas Cylinder 

Gas Cylinder Crisis: రాష్ట్రవ్యాప్తంగా గృహ వినియోగ గ్యాస్ సరఫరా ప్రస్తుతం గందరగోళంగా మారింది. సాధారణ రోజుల్లో రోజుకు 2.15 లక్షల బుకింగ్‌లు జరిగి, వెంటనే డెలివరీ అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకంగా 15 లక్షల సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. బుక్ చేసిన సిలిండర్ ఇంటికి చేరడానికి కనిష్టంగా రెండు నుంచి మూడు వారాల సమయం పడుతోంది. దీంతో విసుగు చెందిన వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సమీక్షలు జరుపుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడటం లేదు.

సిస్టమ్ లాక్‎తో కొత్త చిక్కులు

యుద్ధం ప్రభావంతో ప్రజలు ఆందోళన చెంది గ్యాస్ నిల్వ చేసుకుంటారనే భయంతో కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ లాక్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఒకసారి సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి నిర్దిష్ట గడువు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణాల్లో సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ కనెక్షన్ ఉన్నవారికి 35 రోజుల వరకు సాఫ్ట్‌వేర్ బుకింగ్ తీసుకోదు. ఈ గడువు కూడా డెలివరీ అయిన రోజు నుంచే లెక్కించడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి సిలిండర్ కోసం రెండు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

సాఫ్ట్‌వేర్ మొరాయింపు.. ఇండేన్ వినియోగదారుల ఇక్కట్లు

ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులు సాఫ్ట్‌వేర్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో లక్షలాది మంది బుకింగ్ చేస్తుండటంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు కొంతవరకు నయమనిపిస్తున్నా, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ కూడా 10 నుండి 12 రోజుల జాప్యం తప్పడం లేదు. దీనికి తోడు ఓటీపీ విధానాన్ని 95 శాతం ఖచ్చితంగా అమలు చేయాలని నిబంధన పెట్టడం కూడా డెలివరీ ఆలస్యానికి కారణమవుతోంది.

క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్స్ తిరకాసు

కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, డెలివరీ బాయ్స్ వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే ఏరియాలో కనీసం 25-30 బుకింగ్‌లు ఉంటేనే డెలివరీ బాయ్స్ అక్కడికి వెళ్తున్నారు. తక్కువ బుకింగ్‌లు ఉన్న చోటికి వెళ్తే తమకు గిట్టుబాటు కాదని మొండికేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న డిస్ట్రిబ్యూటర్ల వద్ద రోజుకు 10-20 బిల్లులు మాత్రమే జనరేట్ అవుతుండటంతో రవాణా ఖర్చులు భారం అవుతున్నాయని ఏజెన్సీలు చెబుతున్నాయి. దీనివల్ల శివారు ప్రాంతాల ప్రజలు గ్యాస్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

అధికారుల భరోసా.. కానీ నమ్మకం ఏదీ?

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏమీ లేదని, కేవలం సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం అవుతోందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వారం పది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని, వినియోగదారులు ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అయితే గత వారం 17 లక్షలుగా ఉన్న పెండింగ్ బుకింగ్‌లు ఇప్పుడు 15 లక్షలకు తగ్గాయని, డెలివరీ వేగం పెంచితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు సామాన్యులకు గ్యాస్ తిప్పలు తప్పేలా లేవు.

CR Reddy

CR Reddy

Next Story