10,000mAh బ్యాటరీతో రియల్‌మీ 17 ప్రో.. లీకైన ఫొటోలు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Realme 17 Pro Leak: రియల్‌మీ తన నెక్ట్స్ మిడ్-రేంజ్ సిరీస్‌‌పై పనిచేస్తోంది. అంటే రియల్‌మీ 17 ప్రో ఫోన్‌పై పనిచేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్ ఫోటోలు సోషల్ మీడియాలో లీకవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. 10,000mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా ఏదీ ప్రకటించకపోవడం గమనార్హం.

లీకైన ఫోటోల్లో డిజైన్..

ఫోన్ వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉంది. ముదురు గ్రే లేదా మ్యాట్ బ్లాక్‌లా కనిపిస్తోంది. అంచులు ఫ్లాట్‌గా ఉండటంతో లుక్ నీట్‌గా, లేటెస్ట్‌గా కనిపిస్తోంది.

వెనుక స్క్వేర్ ఆకారపు కెమెరా ఐలాండ్ ఉంది. కానీ లెన్స్‌ల స్థానం, డిజైన్ గతంతో మాదిరగానే ఉంది. రెండు పొడవైన కటౌట్లు, వాటి కింద ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ ఇటీవలి వన్‌ప్లస్ ఫోన్లను గుర్తుచేస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముందు వైపు సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్ హోల్ ఉంది. స్క్రీన్ చుట్టూ సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి.

ఇవి ప్రారంభ లీక్ ఫోటోలు మాత్రమే. లాంచ్ సమయంలో డిజైన్ వేరేగా ఉండొచ్చు.

10,000mAh బ్యాటరీ..

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 10,000mAh బ్యాటరీ కావచ్చు. ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh నుంచి 7,000mAh వరకు బ్యాటరీ ఉంది. రియల్‌మీ 16 ప్రోలో 7,000mAh బ్యాటరీ ఉంది. అంటే కొత్త మోడల్‌లో సుమారు 43 శాతం ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండవచ్చు.

అయితే భారీ బ్యాటరీ అంటే ప్రతి యూజర్‌కు 3, 4 రోజులు వస్తుందని కాదు. బ్యాటరీ ఎంతసేపు వస్తుందనేది స్క్రీన్ బ్రైట్‌నెస్, ఇంటర్నెట్ వాడకం, గేమింగ్, కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లపై ఆధారపడి ఉంటుంది.

ఛార్జింగ్ నెమ్మదించవచ్చు..

లీక్ ప్రకారం రియల్‌మీ 17 ప్రోలో 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండవచ్చు. రియల్‌మీ 16 ప్రోలో 80W ఛార్జింగ్ ఉంది. అంటే బ్యాటరీ సామర్థ్యం పెరిగినా ఛార్జింగ్ వేగం తగ్గవచ్చు. 10,000mAh బ్యాటరీ 65W ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా తెలియదు.

డిస్‌ప్లే, ప్రాసెసర్..

144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్‌ప్లే ఉండొచ్చు. దీనివల్ల సోషల్ మీడియాలో స్క్రోల్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్‌పై కదలికలు సాఫీగా కనిపిస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ (4nm) ఉంటుందనే ప్రచారం ఉంది. అయితే ప్రాసెసర్ పేరు చూసి భారీగా ఆశలు పెట్టుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

కెమెరా: సెల్ఫీలో డౌన్‌గ్రేడ్..?

లీక్ ప్రకారం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. రియల్‌మీ 16 ప్రోలో 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అంటే కొత్త మోడల్‌లో రిజల్యూషన్ తగ్గవచ్చు.

వెనుక కెమెరాల విషయంలో పరిస్థితి స్పష్టంగా లేదు. రియల్‌మీ 16 ప్రోలో 200ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. కొత్త ఫోన్‌లో అదే కెమెరా ఉంటుందో లేదో నిర్ధారణ కాలేదు.

భారత్‌లో లాంచ్, ధర..

రియల్‌మీ 17 ప్రో లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రియల్‌మీ 16 ప్రో భారత్‌లో 2026 జనవరిలో రూ.31,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

Tags: