బడ్జెట్ ధరలో మరో ఫోన్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో రిలీజ్.. ధరెంతంటే?

Lava Smart 4 Pro: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా భారత్‌లో మరో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో వచ్చిన ఈ ఫోన్.. భారీ బ్యాటరీ, దృఢమైన బిల్డ్ క్వాలిటీతో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాకప్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.

7000mAh భారీ బ్యాటరీనే హైలైట్

Lava Smart 4 Proలో 7000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 950 గంటల వరకు స్టాండ్‌బై బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. రోజంతా వీడియోలు, గేమింగ్, కాలింగ్ వాడేవారికి ఛార్జింగ్ టెన్షన్ తగ్గుతుంది. దీంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB Type-C పోర్ట్ ఇచ్చారు.

డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉంది?

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో వస్తుండగా, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చారు. స్క్రోలింగ్, వీడియో చూసేటప్పుడు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. నీలం బ్లూ, కొనార్క్ గోల్డ్ అనే రెండు కలర్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి వచ్చింది.

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ

ఈ ఫోన్ ప్రత్యేకత MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్. అంటే ఫోన్ పదేపదే కింద పడినా త్వరగా పాడవ్వదు, విరగదు. రోజువారీ వాడకంలో జారిపడటం, చిన్నపాటి దెబ్బలు తగిలినా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ అరుదుగా లభిస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

పనితీరు కోసం ఇందులో ఆక్టా-కోర్ Unisoc T610 చిప్‌సెట్ ఇచ్చారు. 4GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. మొత్తం 8GB వరకు ర్యామ్ అనుభవం లభిస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, మైక్రోSD కార్డ్ ద్వారా మెమరీని పెంచుకోవచ్చు.

కెమెరా ఫీచర్లు

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. పోర్ట్రెయిట్, నైట్, AI, ప్రో మోడ్, పనోరమా, స్లో-మోషన్ మోడ్‌లు సపోర్ట్ చేస్తాయి. సెల్ఫీల కోసం ముందువైపు కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ కూడా ఇవ్వడం విశేషం. తక్కువ వెలుతురులో కూడా సెల్ఫీలు బాగా వస్తాయి.

ఆండ్రాయిడ్ 16, క్లీన్ ఎక్స్‌పీరియన్స్

Lava Smart 4 Pro ఆండ్రాయిడ్ 16తో వస్తోంది. స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం లభిస్తుంది. థర్డ్-పార్టీ బ్లోట్‌వేర్ యాప్స్ ఉండవు. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ధర, లభ్యత..

ఈ ఫోన్‌ను సింగిల్ వేరియంట్‌లో లాంచ్ చేశారు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అధీకృత ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. భారీ బ్యాటరీ, గట్టి బిల్డ్, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోరుకునే బడ్జెట్ యూజర్లకు ఇది మంచి ఎంపిక అవుతుంది.

Tags: