స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సంచలనం.. 11,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!
Honor X80 Pro Max: సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000 లేదా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటేనే పెద్దదని అనుకుంటాం. కానీ హానర్ సంస్థ ఆ అంచనాలను తలకిందులు చేయనుంది.
స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సంచలనం.. 11,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!
Honor X80 Pro Max Launch: మొబైల్ ప్రియులకు హానర్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 11,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. హానర్ ఎక్స్80 ప్రో మాక్స్ పేరుతో వస్తున్న ఈ పవర్‌హౌస్ డివైజ్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో టెక్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
బ్యాటరీ సామర్థ్యంలో సరికొత్త రికార్డు..
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000 లేదా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటేనే పెద్దదని అనుకుంటాం. కానీ హానర్ సంస్థ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 11,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఈ కొత్త ఫోన్ లో అమర్చింది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ విడుదల చేసిన హానర్ పవర్ 2 మోడల్‌లో 10,080 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇప్పుడు అంతకంటే పెద్ద బ్యాటరీతో హానర్ ఎక్స్80 ప్రో మాక్స్ రూపుదిద్దుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
లాంచ్ ఎప్పుడు? చార్జింగ్ విశేషాలు ఏంటి?
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో హానర్ సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. జూన్ 22వ తేదీన స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడం కోసం ఇందులో 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. అంతేకాదు, అత్యవసర సమయాల్లో ఇతర ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉండటం విశేషం.
ఆకట్టుకునే డిజైన్.. అదిరిపోయే రంగులు..
లాంచ్ తేదీ ప్రకటనతో పాటు ఈ ఫోన్ డిజైన్, రంగులకు సంబంధించిన వివరాలను కూడా సంస్థ పంచుకుంది. వెనుక వైపు ఫ్లాట్ ప్యానెల్‌తో పాటు మధ్యలో వృత్తాకారంలో ఉండే కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. కింద హానర్ బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ మొత్తం నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. అవి లైట్నింగ్ రెడ్, మూన్‌లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉండగా, ఎడమ వైపు భాగాన్ని పూర్తిగా క్లీన్‌గా వదిలేశారు.
కెమెరా, డిస్‌ప్లే ప్రత్యేకతలు..
లీకైన వివరాల ప్రకారం, ఈ హానర్ ఎక్స్80 ప్రో మాక్స్ ఫోన్ లో 6.8 అంగుళాల ఓలెడ్ (OLED) డిస్‌ప్లేను అందించనున్నారు. స్క్రీన్ పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ డిజైన్ ఉంటుంది. వెనుక వైపున ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మాట్రిక్స్ ఏఐ విజన్ కెమెరా సిస్టమ్‌ను అమర్చారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కోసం చైనాలోని అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు బుకింగ్‌లు (ప్రీ-ఆర్డర్) కూడా ప్రారంభమయ్యాయి.
బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడేవారికి ఈ హానర్ ఎక్స్80 ప్రో మాక్స్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు అత్యాధునిక ఫీచర్లను అందిస్తుండటంతో ఈ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. చైనా లాంచ్ ముగిసిన తర్వాత ఈ సిరీస్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.