'అందుబాటులోకి సూపర్హ్యూమన్ ఏఐ.. మరో 15 నెలల్లో అంతా నిరుద్యోగులవడం పక్కా..'!
Anthropic Researcher Tao Lin: మరో 15 నెలల్లో సూపర్హ్యూమన్ ఏఐ అందుబాటులోకి రావచ్చని ఆంథ్రోపిక్ పరిశోధకుడు తావో లిన్ అంచనా వేశారు. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
'అందుబాటులోకి సూపర్హ్యూమన్ ఏఐ.. మరో 15 నెలల్లో అంతా నిరుద్యోగులవడం పక్కా..'!
Superhuman AI: కృత్రిమ మేధ (AI) టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగాన్ని వేగంగా మారుస్తోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఏఐ వినియోగాన్ని పెంచుతూ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థలో ఏఐ భద్రతపై పనిచేస్తున్న పరిశోధకుడు తావో లిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన అంచనా వేశారు. అంతేకాదు.. మానవ నిపుణులను మించే స్థాయిలో పనిచేసే సూపర్హ్యూమన్ ఏఐ మరో 15 నెలల్లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.
మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందా?
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని సంస్థ 'పాలిసేడ్ రీసెర్చ్'తో మాట్లాడిన తావో లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
దీంతో చాలామందికి ఉద్యోగాలు లేకుండా పోవచ్చని, జీవనోపాధి కోసం ప్రభుత్వ సాయం మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా సూపర్హ్యూమన్ ఏఐ వల్ల ఉద్యోగ రంగంలో భారీ మార్పులు సంభవించవచ్చని ఆయన అంచనా వేశారు.
సూపర్హ్యూమన్ ఏఐ అంటే ఏమిటి?
సాధారణ ఏఐ టూల్స్ కొన్ని నిర్దిష్ట పనులను వేగంగా, సమర్థంగా చేయగలవు. అయితే సూపర్హ్యూమన్ ఏఐ అంటే దాదాపు అన్ని రంగాల్లోనూ మానవ నిపుణులతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయగల సామర్థ్యం ఉన్న ఏఐ వ్యవస్థ.
తావో లిన్ అంచనా ప్రకారం.. ఇలాంటి సూపర్హ్యూమన్ ఏఐ మరో 15 నెలల్లోనే వాస్తవ రూపం దాల్చవచ్చు. అదే జరిగితే ఉద్యోగాలు, వ్యాపారాలు, పని విధానాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆంథ్రోపిక్ సంస్థ ఏమంటోంది?
తావో లిన్ చేసిన వ్యాఖ్యలపై ఆంథ్రోపిక్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవి సంస్థ అధికారిక అంచనాలు కాకుండా, ఆ పరిశోధకుడి వ్యక్తిగత అభిప్రాయాలుగా చూడాలి. అయితే ఏఐ అభివృద్ధికి హద్దులు, భద్రతా ప్రమాణాలు అవసరమనే అంశంపై ఆంథ్రోపిక్ గతంలోనూ చర్చించింది.
మరోవైపు సూపర్హ్యూమన్ ఏఐ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలన్నీ మాయమవుతాయని తావో లిన్ చెప్పలేదు. ఏఐను వివిధ రంగాల్లో అమలు చేయడానికి సమయం పడుతుందని, సాంకేతిక అభివృద్ధికి, ఉద్యోగ రంగంలో దాని ప్రభావానికి మధ్య కొంత వ్యవధి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
2026లోనూ టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు..
2026లో ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లోనూ ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణలు చోటుచేసుకున్నాయి. కొన్ని పరిశోధనల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కంపెనీల్లో కొత్త నియామకాల వేగం తగ్గుతోందనే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే అన్ని ఉద్యోగాల కోతలకు ఏఐనే కారణమని చెప్పలేం. కంపెనీల వ్యయ నియంత్రణ, వ్యాపార వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులు కూడా ఇందుకు కారణాలు కావచ్చు. మొత్తంగా తావో లిన్ అంచనా ఏఐ భవిష్యత్తుపై మరోసారి చర్చకు తెరలేపింది. సూపర్హ్యూమన్ ఏఐ నిజంగా ఆయన పేర్కొన్న సమయంలో అందుబాటులోకి వస్తుందా? వస్తే ఉద్యోగ రంగంపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.