Yuvraj Singh Coach: సౌరవ్ గంగూలీ మాస్టర్ ప్లాన్.. కోచ్‌గా యువరాజ్!

Yuvraj Singh Coach: యువరాజ్ సింగ్ కోచింగ్ వైపు వెళుతున్నాడా?.. అంటే అవుననే సమాధానాలు విపిస్తున్నాయి.

Update: 2026-06-19 11:31 GMT

Yuvraj Singh Coach: సౌరవ్ గంగూలీ మాస్టర్ ప్లాన్.. కోచ్‌గా యువరాజ్!

Yuvraj Singh Coach: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ కోచింగ్ వైపు వెళుతున్నాడా?.. అంటే అవుననే సమాధానాలు విపిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌తో యువీ కోచ్‌గా మారనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కోచింగ్ సిబ్బందిలో చేరేందుకు యువరాజ్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈ న్యూస్ భారత క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆటగాడిగా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్.. ఇప్పుడు కోచ్‌గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. తాను కోచింగ్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు గతంలో యువి చెప్పిన విషయం తెలిసిందే.

దాదా ప్రత్యేక ఆసక్తి:

మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గంగూలీ తిరిగి జట్టులో చేరిన తర్వాత యువరాజ్ సింగ్‌ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేయాలని అనుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా యువరాజ్ జట్టుతో చేరే అవకాశాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చేతుల్లోకి ఢిల్లీ క్యాపిటల్స్:

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని సహ యజమానులైన జీఎంఆర్ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రెండేళ్ల చొప్పున నిర్వహిస్తూ వస్తున్నాయి. 2025, 2026 సీజన్లలో జీఎంఆర్ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టగా.. 2027 నుంచి మళ్లీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ మార్పుతో పాటు ఫ్రాంచైజీలో కోచింగ్ విభాగంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

నిరాశపరిచిన డీసీ:

అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. 2025, 2026 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. 2025లో జట్టు అద్భుత ఆరంభం చేసినప్పటికీ.. సీజన్ ద్వితీయార్థంలో తడబడింది. చివరకు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2026లో కూడా నిలకడ లేని ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలు జట్టు యాజమాన్యాన్ని పునరాలోచనలో పడేశాయి.

హేమంగ్ బదానీ భవిష్యత్తుపై అనిశ్చితి:

ప్రస్తుత హెడ్ కోచ్ హేమంగ్ బదానీ భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి. జట్టు వరుసగా రెండు సీజన్లలో విఫలమవడంతో కోచింగ్ విభాగంలో మార్పులు తప్పవని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తిరిగి కీలక బాధ్యతలు చేపట్టి.. యువరాజ్ సింగ్‌ను తనతో పాటు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027లో గంగూలీ-యువరాజ్ జోడీ ఢిల్లీ డగౌట్‌లో కనిపిస్తే.. జట్టు కొత్త విజయాల దిశగా అడుగులు వేయవచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్యాపిటల్స్‌తో దాదా విజయవంతమైన ప్రయాణం:

ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతని మార్గదర్శకత్వంలో జట్టు ఫైనల్ వరకు చేరుకుంది. ఈ అనుభవంతో గంగూలీ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక వ్యక్తిగా మారనున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ ఇప్పటివరకు ఏ ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించలేదు. కోచింగ్ బాధ్యతలు స్వీకరిస్తే అది అతని క్రికెట్ కెరీర్‌లో కొత్త అధ్యాయంగా నిలవనుంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.

Tags:    

Similar News