Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించినా.. ప్రపంచ రికార్డు మాత్రం పాకిస్థాన్ ఆటగాడిదే!

Vaibhav Sooryavanshi: Hasan Raza Still Youngest Men's Debutant. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన పురుష క్రికెటర్ మాత్రం వైభవ్ సూర్యవంశీ కాదు.

Update: 2026-07-04 15:03 GMT

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించినా.. ప్రపంచ రికార్డు మాత్రం పాకిస్థాన్ ఆటగాడిదే!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగిన వైభవ్.. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో దాదాపు 37 ఏళ్లుగా కొనసాగుతున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బుడ్డోడు బద్దలు కొట్టాడు.

అయితే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన పురుష క్రికెటర్ మాత్రం వైభవ్ సూర్యవంశీ కాదు. ఆ రికార్డు ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా పేరిటే ఉంది. హసన్ 1996లో జింబాబ్వేపై 14 సంవత్సరాల 227 రోజుల వయసులో టెస్టు అరంగేట్రం చేశాడు. అనంతరం అదే జింబాబ్వేపై 14 సంవత్సరాల 233 రోజుల వయసులో వన్డేల్లో కూడా తొలి మ్యాచ్ ఆడాడు. దీంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఇప్పటికీ హసన్ రజానే కొనసాగుతున్నాడు. అతడు తన కెరీర్‌లో ఏడు టెస్టులు, 16 వన్డేలు ఆడాడు.

వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో చోటు దక్కించుకోవడం ద్వారా మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపికైన బుడ్డోడు.. భారత జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడుగా కూడా నిలిచాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో 36 ఏళ్ల రికార్డును కూడా అధిగమించాడు. వైభవ్‌కు భారత జట్టులో అవకాశం రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చేసిన అద్భుత ప్రదర్శనే. ఆ సీజన్‌లో అతడు 776 పరుగులు చేయగా.. 237.30 స్ట్రైక్‌రేట్ కొనసాగించాడు. ఐపీఎల్ 2026లో బుడ్డోడు ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఈ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2026 తర్వాత శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ టోర్నీలో కూడా వైభవ్ సూర్యవంశీ తన సత్తా చాటాడు. శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లతో జరిగిన సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంక-ఏపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. యూత్ క్రికెట్‌లోనూ వైభవ్ అద్భుతమైన రికార్డులు నమోదు చేశాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. 439 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధశతకాలతో యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ప్రస్తుతం అతడి దూకుడు, ప్రతిభను చూసి భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించినప్పటికీ.. ప్రపంచ పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ రికార్డు మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా పేరిట కొనసాగుతోంది.

Tags:    

Similar News