Rohit Sharma: లార్డ్స్‌లో రోహిత్‌ కు ఫేర్‌వెల్ మ్యాచ్.. స్పందించిన టీమిండియా కోచ్!

Rohit Sharma: రోహిత్ శర్మ వీడ్కోలు వార్తలను భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఖండించాడు.

Update: 2026-07-17 03:39 GMT

Rohit Sharma: లార్డ్స్‌లో రోహిత్‌ కు ఫేర్‌వెల్ మ్యాచ్.. స్పందించిన టీమిండియా కోచ్!

Rohit Sharma: వన్డే ప్రపంచ కప్‌ 2027లో ఆడాలన్నది టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కల. కానీ లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆదివారం (జులై 19) జరిగే చివరి వన్డేనే హిట్‌మ్యాన్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావొచ్చు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ను జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదట.

మెగా టోర్నీ సమీపిస్తున్న సమయంలో రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 47 బంతుల్లో 26 రన్స్ చేసి నిరాశపరిచాడు. అంతేకాదు గత ఎనిమిది వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో 241 పరుగులే బాదాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఖండించాడు.

కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కోటక్.. రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. 'రోహిత్ శర్మ లాంటి గొప్ప ఆటగాడు ఒత్తిడికి గురవుతాడని నేను అనుకోవడం లేదు. తొలి రెండు వన్డేల్లో పరుగులు చేయకపోయినా పెద్దగా తేడా ఉండదు. రెండో మ్యాచ్‌లో కూడా హిట్‌మ్యాన్ మంచి ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అది జరగలేదు. అంతే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; అని కోటక్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న కథనాల గురించి స్పందిస్తూ.. 'ప్రతి బ్యాటర్‌కు కొన్నిసార్లు ఆరంభంలో లయ దొరకదు. అలాంటి పరిస్థితులు సహజమే. నేను చాలా క్రికెట్ ఆడాను, చాలా మంది గొప్ప బ్యాటర్లను చూశాను. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా మొమెంటం దొరకదు. అది రోహిత్ విషయంలో కూడా జరిగింది. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేలో మాత్రం అతడు పూర్తిగా భిన్నమైన ఇన్నింగ్స్ ఆడే అవకాశముంది' అని సితాన్షు కోటక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ జట్టులో కొనసాగుతాడని, ఎలాంటి టెన్షన్ అవసరం లేదని కోటక్ చెప్పకనే చెప్పాడు.

రోహిత్ ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాడనే అభిప్రాయాన్ని కూడా కోటక్ తోసిపుచ్చాడు. 'డబుల్ బౌన్స్ కారణంగా రోహిత్ సాధారణంగా ఆడే షాట్లు ఆడేందుకు కొంత అసౌకర్యంగా ఫీలయ్యాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ త్వరగా లయ అందుకోవడంతో రోహిత్‌కు తనకు నచ్చిన బంతులు రాలేదు. నేను స్ట్రగుల్ అనే పదాన్ని ఉపయోగించను.

రోహిత్ లాంటి ఆటగాడు ఒక్క ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్‌ను మార్చగలడు. లార్డ్స్‌లో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ రావచ్చు' అని కోటక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. లార్డ్స్ వేదికగా జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్ శర్మపై అందరి దృష్టి నిలిచింది. బ్యాట్‌తో విమర్శలకు సమాధానం ఇస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News