నీరజ్ చోప్రాకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రెండు ఈవెంట్లే ఆడి డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత!

Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కేవలం రెండు డైమండ్ లీగ్ ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

Update: 2026-08-28 15:44 GMT

నీరజ్ చోప్రాకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రెండు ఈవెంట్లే ఆడి డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత!

Neeraj chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా మరో కీలక ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో కేవలం రెండు డైమండ్ లీగ్ ఈవెంట్లలోనే పాల్గొన్నప్పటికీ.. డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరగనున్న సీజన్ ముగింపు పోటీల్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు.

కేవలం రెండు ఈవెంట్లలోనే..

2026 డైమండ్ లీగ్ సీజన్‌లో పురుషుల జావెలిన్ త్రో ఐదు మీటింగ్స్‌లో మాత్రమే భాగమైంది. అయితే నీరజ్ వాటిలో రెండు ఈవెంట్లలోనే పోటీ పడ్డాడు.

జూన్ 19న దోహాలో జరిగిన పోటీలో 85.69 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆగస్టు 21న లాసాన్‌లో జరిగిన పోటీలో తన సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. అక్కడ 88.05 మీటర్లు విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆరో స్థానంలో నీరజ్..

జ్యూరిక్‌లో చివరి డైమండ్ లీగ్ మీటింగ్ ముగిసిన తర్వాత పురుషుల జావెలిన్ పాయింట్ల పట్టికలో నీరజ్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

పురుషుల జావెలిన్ విభాగంలో టాప్-6లో నిలిచిన అథ్లెట్లకే డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత లభిస్తుంది. దీంతో ఆరో స్థానంలో ఉన్న నీరజ్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.

గాయం కారణంగానే పరిమిత ఈవెంట్లు..

నీరజ్‌కు గత కొంతకాలంగా గాయం సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో 2026 డైమండ్ లీగ్ సీజన్‌లో అతడి రాక ఆలస్యమైంది.

దోహా మీటింగ్‌తో సీజన్‌ను ప్రారంభించిన నీరజ్.. ఆ తర్వాత లాసాన్‌లో తన ప్రదర్శనను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. 88.05 మీటర్ల త్రోతో సీజన్ బెస్ట్ నమోదు చేసి ఫైనల్స్ రేసులో కీలక స్థానం సంపాదించాడు.

డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారీ ప్రైజ్‌మనీ..!

డైమండ్ లీగ్ ఫైనల్ కేవలం ప్రతిష్ఠాత్మక పోటీ మాత్రమే కాదు.. విజేతలకు భారీ నగదు బహుమతులు కూడా అందుతాయి.2026 సీజన్‌లో డైమండ్ లీగ్ ఫైనల్ కోసం మొత్తం 2.24 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీని కేటాయించారు.

జావెలిన్ వంటి డైమండ్ విభాగంలో విజేతకు 30,000 డాలర్లు లభిస్తాయి. రెండో స్థానానికి 12,000, మూడో స్థానానికి 7,000 డాలర్లు అందుతాయి.

అంటే నీరజ్ చోప్రా బ్రస్సెల్స్‌లో టైటిల్ సాధిస్తే భారీ నగదు బహుమతితో పాటు మరో డైమండ్ లీగ్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది.

బ్రస్సెల్స్‌లో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా?

నీరజ్ ఇప్పటికే ఒకసారి డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. డైమండ్ లీగ్ మీటింగ్స్‌లో ఐదు విజయాలు సాధించిన రికార్డు కూడా అతడి ఖాతాలో ఉంది.

ఇప్పుడు బ్రస్సెల్స్‌లో జరిగే ఫైనల్‌లో మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా 88.05 మీటర్ల సీజన్ బెస్ట్ తర్వాత నీరజ్ మరింత దూరం విసరగలడా? అన్నదే ఆసక్తికరంగా మారింది. రెండు ఈవెంట్లే ఆడి ఫైనల్ బెర్త్ సాధించిన నీరజ్.. బ్రస్సెల్స్‌లో టైటిల్ గెలిచి సీజన్‌ను ఘనంగా ముగిస్తాడేమో చూడాలి!

Tags:    

Similar News