Mumbai Indians: నో ఫైనల్, నో టైటిల్.. ఆ 'ఒక్కడు' లేకుంటే ముంబైకు అన్నీ కష్టాలే?

Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ కెప్టెన్సీ లేనప్పుడు ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉంది? తాజా గణాంకాలు ఏం చెబుతున్నాయి?

Update: 2026-05-12 12:34 GMT

Mumbai Indians: నో ఫైనల్, నో టైటిల్.. ఆ 'ఒక్కడు' లేకుంటే ముంబైకు అన్నీ కష్టాలే?

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఒకటి. ఇప్పటివరకు ఐదు టైటిల్స్ గెలుచుకుని టోర్నీలో ఆధిపత్యం చెలాయించింది. ఈ ఐదు టైటిల్స్ కూడా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం. అంటే ముంబై విజయాల్లో హిట్‌మ్యాన్ పాత్ర ఎంత కీలకమో చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు ముంబై వరుస పరాజయాల నేపథ్యంలో రోహిత్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హిట్‌మ్యాన్ కెప్టెన్సీ లేకుండా ముంబై ప్రదర్శన ఎలా ఉందన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర గణాంకాలు వైరల్ అవుతున్నాయి. ఈ గణాంకాలు చూస్తే రోహిత్ నాయకత్వం ముంబై విజయాలకు ఎంత ముఖ్యమో స్పష్టంగా అర్థమవుతోంది.

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ముందు, కెప్టెన్సీ చేయని సందర్భాల్లో ముంబై ఇండియన్స్ మొత్తం 147 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 74 విజయాలు మాత్రమే సాధించగా.. 71 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. జట్టు విజయ శాతం కేవలం 50.3 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ముంబై ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబై.. రోహిత్ నాయకత్వం లేకుంటే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రోహిత్ శర్మ లేకుండా ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2010, 2011, 2012 సీజన్లలో ఎంఐ ప్లేఆఫ్స్ ఆడగా.. తాజాగా 2025లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మరోసారి ప్లేఆఫ్స్ చేరుకుంది. అయితే ఫైనల్‌కు మాత్రం ఒక్కసారి మాత్రమే వెళ్లగలిగింది. 2010 సీజన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ఫైనల్ చేరిన ముంబై.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదిగింది. అతడి నాయకత్వంలో జట్టు ఐదు సార్లు టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఒత్తిడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్లను సమర్థంగా వినియోగించడం, కీలక మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించడం రోహిత్ ప్రత్యేకతగా నిలిచాయి.

ఈ గణాంకాలతో సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తికర చర్చలు చేస్తున్నారు. 'రోహిత్ శర్మ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌కు అసలైన గేమ్ ఛేంజర్ కెప్టెన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సీజన్‌లో కూడా ముంబై ప్రదర్శనపై అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది. దాంతో హార్దిక్ పాండ్యపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News