IPL 2026 : ఆర్సీబీ కెప్టెన్ ఉదారత... ఐపీఎల్ 2026 కప్పును ఆ 11 మందికి అంకితం చేసిన పాటిదార్
IPL 2026 : ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ విజయాన్ని గత ఏడాది తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానులకు అంకితం ఇచ్చాడు. అతను ధోని, రోహిత్ సరసన చేరాడు.
IPL 2026
IPL 2026 : ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31న జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన ఒక ప్రకటన అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ ఐపీఎల్ ట్రోఫీని అతను 11 మంది ప్రత్యేక వ్యక్తులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఆర్సీబీ కప్పు గెలవగానే కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ విజయాన్ని ఆ 11 మందికి అంకితం ఇస్తున్నట్లు చెప్పడంతో అందరిలోనూ ఒకటే ఉత్సుకత నెలకొంది. అయితే దీని వెనుక ఒక కన్నీటి గాథ ఉంది. గత ఏడాది (2025) ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో బెంగళూరు నగరంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఒక భారీ విక్టరీ పరేడ్‌ను నిర్వహించింది. ఆ సమయంలో అభిమానుల తాకిడి ఎక్కువై అక్కడ జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐపీఎల్ 2026 ట్రోఫీని ఆ ప్రమాదంలో చనిపోయిన 11 మంది అభిమానుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు రజత్ పాటిదార్ ప్రకటించాడు. ఆర్సీబీకి వారు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదని, తమ కుటుంబ సభ్యులతో సమానమని కెప్టెన్ ఎమోషనల్ అయ్యాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోందని చెప్పాడు. గత ఏడాదికి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, తాను ప్రస్తుతం ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ గెలుపు తెచ్చిన ఆనందాన్ని వర్ణించడానికి తన దగ్గర మాటలు సరిపోవడం లేదని, చాలా సంతోషంగా ఉందని కెప్టెన్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
గత సీజన్ విజయానికి, ఈసారి సాధించిన ట్రోఫీకి మధ్య ఉన్న తేడాను కూడా రజత్ పాటిదార్ వివరించాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఆడేటప్పుడు ఆర్సీబీ టైటిల్ గెలవాలనే విపరీతమైన ఒత్తిడి ఉండేదని అన్నాడు. కానీ, ఈ 2026 సీజన్ ఫైనల్లో మాత్రం జట్టుపై ఎలాంటి ప్రెజర్ లేదని, ఆటగాళ్లంతా పక్కా ప్లానింగ్‌తో, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడి కప్పును కొట్టామని చాలా కూల్‌గా చెప్పాడు.
గుజరాత్‌పై సాధించిన ఈ గెలుపుతో రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తమ జట్టును వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపి, టైటిల్‌ను సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్న మూడో కెప్టెన్‌గా రజత్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఈ అరుదైన ఘనతను ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు మాత్రమే సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా లీజెండ్ ఎంఎస్ ధోని (2010, 2011), ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (2019, 2020) లీగ్‌లో బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలు గెలిచారు. ఇప్పుడు ఆ ఇద్దరి సరసన రజత్ పాటిదార్ చేరిపోవడం విశేషం.